Ashes Series : యాషెస్ సిరీస్‌ ఓటమి.. రూట్ తప్పుకోవాలన్న మాజీ కెప్టెన్‌

యాషెస్‌ సిరీస్‌ను ఇంగ్లాండ్‌ ఓడిపోవడంతో ఆ జట్టు సారథి జో రూట్‌పై విమర్శల...

Updated : 01 Jan 2022 15:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యాషెస్‌ సిరీస్‌ను ఇంగ్లాండ్‌ ఓడిపోవడంతో ఆ జట్టు సారథి జో రూట్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే ఆసీస్ 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో జో రూట్‌ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఈ క్రమంలో సిరీస్‌ ఓటమికి రూట్‌ బాధ్యత వహించాలని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌, కెప్టెన్‌ మైఖేల్‌ అథర్టెన్‌ విమర్శించాడు. అంతేకాకుండా యాషెస్ ఓటమికి ప్రధాన కోచ్ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ కూడా బాధ్యుడేనని వ్యాఖ్యానించాడు. 

‘‘యాషెస్‌ సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడం నుంచి ప్రణాళికల వరకు ఎన్నో తప్పులు జరిగాయి. అందుకే సిరీస్‌ ఓటమికి కెప్టెన్‌గా బాధ్యత వహించాలి. రూట్‌ మంచి కెప్టెనే. ఆటగాడిగానూ చాలా బాగా రాణించాడు. ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌కు రాయబారిగా వ్యవహరించాడు. గత ఐదేళ్లు ఎంతో కష్టపడ్డాడు. అయితే ఆసీస్‌లో యాషెస్‌ సిరీస్‌లో మాత్రం సారథ్యపరంగా గడ్డుకాలం ఎదుర్కొన్నాడు. అందుకే ఇది మరొకరిని ఎంచుకునే సమయం కావచ్చు. రూట్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ సరిపోతాడు’’ అని మైకెల్‌ పేర్కొన్నాడు. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌ జనవరి 5వ తేదీ నుంచి ఆసీస్‌తో నాలుగో టెస్టులో తలపడనుంది.

అసలు టెస్టు ఫార్మాట్‌కు పనికిరాదు

ప్రస్తుత ఫామ్‌ను చూస్తే ఇంగ్లాండ్‌ జట్టు టెస్టు ఫార్మాట్‌కు ఫిట్‌ కాదని మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘అత్యుత్తమ ఆటగాళ్లు ఇందులో (టెస్టు జట్టు) ఆడేందుకు ఇష్టపడరు. ఇక యువ ఆటగాళ్లు నా మాదిరిగా ఇతర టాప్‌ ప్లేయర్ల నుంచి నేర్చుకోరు. పేలవమైన వికెట్ల మీద సగటు బౌలర్ల చేతిలో ఔట్‌ కావడం ఎంతో బాధాకరంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని