Shaili Singh: శైలి సింగ్‌.. నాలాంటి సామర్థ్యమున్న అమ్మాయే: అంజు

శిష్యురాలు శైలి సింగ్‌.. లాంగ్‌జంప్‌లో ఇంచుమించు తన లాంటి సామర్థ్యం ఉన్న అమ్మాయే అని భారత మాజీ స్టార్‌ అంజు బాబి జార్జి చెప్పింది. తాజాగా అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శైలి రజతం గెలిచిన...

Published : 24 Aug 2021 09:29 IST

దిల్లీ: శిష్యురాలు శైలి సింగ్‌.. లాంగ్‌జంప్‌లో ఇంచుమించు తన లాంటి సామర్థ్యం ఉన్న అమ్మాయే అని భారత మాజీ స్టార్‌ అంజు బాబి జార్జి చెప్పింది. తాజాగా అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శైలి రజతం గెలిచిన నేపథ్యంలో ఆమె ఇలా వ్యాఖ్యానించింది. ‘‘శైలిని తొలిసారి చూసినప్పుడే ఆమె శరీరాకృతి లాంగ్‌జంప్‌కు సరిగ్గా సరిపోతుందని అనిపించింది. వేగంగా నేర్చుకోవడం, దేన్నైనా సాధించేదాకా వదలక పోవడం ఆమె లక్షణాలు. ఒక్క మాటలో చెప్పాలంటే శైలి నాలాంటి సామర్థ్యం ఉన్న అమ్మాయి. ఆమె గురించి మొదట నా భర్త రాబర్ట్‌ ద్వారా తెలిసింది. 2017లో విజయవాడలో జరిగిన జాతీయ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శైలి 4.64 మీటర్ల దూరం దూకి అయిదో స్థానంలో నిలిచింది.

అయితే, ఆమెలో సహజ సామర్థ్యం ఉందనిపించింది. అందుకే విశాఖపట్నంలో జరిగిన జాతీయ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లి ఆమె దూకే తీరును గమనించా.అప్పుడే అర్ధం అయింది ఆమెకు బంగారు భవిష్యత్‌ ఉందని. 2018లో రాబర్ట్‌ సాయంతో సాయ్‌ బెంగళూరు కేంద్రానికి రావడంతో శైలి ఆటలో రాటుదేలింది. ఆరంభంలో 4.50 మీటర్లు మాత్రమే దూకే ఆమె.. మూడేళ్లలో మరో రెండు మీటర్లు లంఘించే స్థాయికి చేరింది. ప్రపంచ అథ్లెటిక్స్‌ టోర్నీలో 6.60 దూకాలనే లక్ష్యంతో బరిలో దిగింది. ఆ లక్ష్యానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. త్వరలో ఆమె నా రికార్డును (6.59 మీ) అధిగమిస్తుందని భావిస్తున్నా’’ అని అంజు చెప్పింది. 2003 పారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 6.59 మీటర్ల దూరం దూకడం ద్వారా అంజు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తాజాగా నైరోబిలో జరిగిన ప్రపంచ అండర్‌-20 టోర్నీలో శైలి కూడా సరిగ్గా 6.59 మీటర్లే దూకి రజతం గెలిచింది. ఆమె సెంటీమీటరు తేడాతో స్వర్ణం కోల్పోయింది. ప్రస్తుతం అంజు జార్జి అకాడమీలో శిక్షణ పొందుతున్న శైలి.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో పుట్టింది. నాన్న లేకపోవడంతో ఆమె అమ్మ టైలరింగ్‌ చేస్తూ శైలిని పెంచింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని