
Ashes : నవ్వులు తెప్పిస్తున్న డేవిడ్ వార్నర్ వీడియో!
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో సరదా సంఘటనలకు కొదవేం ఉండదు. ఆటగాళ్లు కావాలని చేయకపోయినా ఒక్కోసారి ఫన్ క్రియేటవుతుంది. గేల్, పొలార్డ్, బ్రావో వంటి క్రికెటర్లు మాత్రం మైదానంలోనూ అప్పుడప్పుడు తమాషాలు చేస్తుంటారు. అయితే కొన్ని జట్ల మధ్య జరిగే సిరీస్‌లూ చాలా హాట్‌హాట్‌గా సాగుతుంటాయి. ఆటగాళ్ల చాలా దూకుడుగా ఉంటారు. మాటల యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో ‘యాషెస్’ అంటేనే ఆసీస్, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లతోపాటు అభిమానులకు భావోద్వేగభరితమైన సిరీస్. అలాంటిది ఆస్ట్రేలియా వేదికగా యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. తొలి టెస్టుకు గబ్బా వేదిక. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ కామెడీ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేసింది. అసలేం జరిగిందంటే..
అప్పటికే వార్నర్ అర్ధశతకం సాధించి మంచి ఊపు మీదున్నాడు. అయితే ఇంగ్లాండ్ బౌలర్ రాబిన్సన్ బౌలింగ్‌లో వార్నర్ షాట్ ఆడాడు. అయితే అది షార్ట్‌లెగ్ ఫీల్డర్ హసీబ్ హమీద్ వద్దకు వెళ్లింది. ఈలోపే కాస్త ముందుకు వచ్చిన వార్నర్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అలా వెళ్లే క్రమంలో పిచ్ మీద జారడంతో చేతిలోని బ్యాట్ చేజారింది. దీంతో రనౌట్ తప్పదేమోనని అభిమానులు భావించారు. అయితే హమీద్ వేసిన త్రో వికెట్లను తాకలేదు. అప్పటికీ క్రీజ్ బయటే ఉన్న వార్నర్ పాకుతూ చేరుకోవడం అభిమానులకు నవ్వు తెప్పించింది. అయితే ఊరికనే వికెట్‌ను ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడడని.. వార్నర్ ఫీట్‌ను నెటిజన్లు అభినందించారు. అయితే సెంచరీకి ఆరు పరుగుల దూరంలో వార్నర్ (94) ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 147 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే 196 పరుగుల ఆధిక్యం సాధించిన ఆసీస్ మ్యాచ్‌పై పట్టు సాధించింది.