Ashes Series: వార్నర్‌ నో-బాల్‌కు బౌల్డవ్వడం చిరాకు తెప్పించింది: బెన్‌స్టోక్స్

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో ఆడిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ నో-బాల్‌కు ఔటవ్వడం, అది నాటౌట్‌గా ప్రకటించడం.. చిరాకు తెప్పించిందని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు...

Published : 15 Dec 2021 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో ఆడిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ నో-బాల్‌కు ఔటవ్వడం, అది నాటౌట్‌గా ప్రకటించడం.. చిరాకు తెప్పించిందని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ (17) పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా స్టోక్స్‌ వేసిన ఓ బంతికి బౌల్డ్‌ అయ్యాడు. అయితే, రీప్లేలో ఆ బంతి నో-బాల్‌గా పడిందని తేలింది. స్టోక్స్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు క్రీజు బయట కాలు పెట్టి బౌలింగ్‌ చేశాడని స్పష్టమైంది. అలాగే అంతకుముందు అతడు వేసిన మరిన్ని బంతులు కూడా నో-బాల్స్‌గానే పడ్డాయని, సాంకేతిక కారణాల రీత్యా ఈ విషయాన్ని థర్డ్‌ అంపైర్‌ గుర్తించలేదని కూడా బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలోనే ఆ వివాదాస్పద అంశంపై స్టోక్స్‌ తాజాగా స్పందించాడు.

‘డేవిడ్‌ వార్నర్‌ ఆదిలోనే నో-బాల్‌కు బౌల్డ్‌ కావడం, అది తర్వాత గుర్తించి నాటౌట్‌గా ప్రకటించడం చిరాకు తెప్పించింది. అయితే, అది నో-బాల్ అని నాకు ముందే తెలుసని కొందరు అన్నారు. కానీ, అది నిజం కాదు. వార్నర్‌ బౌల్డ్‌ అయ్యాక అంపైర్ల వైపు చూస్తే.. వాళ్లు ఏదో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అది నో-బాల్‌ అయి ఉంటుందని నేను అనుకున్నా. అయితే, అంతకుముందు కూడా పలు బంతులను అలాగే వేశానని గుర్తించారు. నేను క్రీజు లోపల నుంచే బౌలింగ్‌ చేయాలి. కానీ, ఒక బౌలర్‌గా నేను నో-బాల్స్‌ వేస్తుంటే అంపైర్లు గుర్తించి హెచ్చరించాలి. అది వార్నర్‌ బౌల్డ్‌ అయ్యేంతవరకు నాకు ఎవరూ చెప్పలేదు. అప్పటికే ఆలస్యమైంది’ అని స్టోక్స్‌ ఓ పత్రికకు రాసిన కథనంలో పేర్కొన్నాడు. కాగా, వార్నర్‌ (94) తర్వాత భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరికి ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌లో గెలుపొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని