Virat - Rahane - Pujara : వారిద్దరి కంటే కోహ్లీ గణాంకాలేమీ భిన్నంగా లేవు: ఆశిష్ నెహ్రా

 దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మిడిలార్డర్‌ బ్యాటర్లు...

Published : 05 Jan 2022 01:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత మిడిలార్డర్‌ బ్యాటర్లు ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె దారుణ ప్రదర్శనపై విమర్శల వర్షం కురుస్తోంది. వారిద్దరిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లూ వస్తున్నాయి. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పుజారా గోల్డెన్‌డకౌట్‌గా వెనుదిరగగా.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రహానె గోల్డెన్‌ డకౌట్‌ కావడం గమనార్హం. ఈ క్రమంలో రహానె, పుజారా ప్రదర్శనపై టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ అశిష్ నెహ్రా స్పందించాడు. మిడిలార్డర్‌ బ్యాటర్లకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ కూడా ఇటువంటి గణాంకాలనే నమోదు చేస్తున్నాడు. అయితే జట్టులో అతడి స్థానంపై ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే కోహ్లీ కెప్టెన్‌ కాబట్టే ఎవరూ అడగరు. ఇక నేను చెబుతున్న ఇద్దరు ఆటగాళ్ల (రహానె, పుజారా) కంటే కోహ్లీ విభిన్నమైన స్థాయి ప్లేయర్‌. కోహ్లీతో ఈ మిడిలార్డర్‌ బ్యాటర్లను పోల్చడం సరైంది కాదు. అయితే రహానె, పుజారా కూడానూ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడు టాప్‌లో నిలిచినవారే. ఇప్పుడు ఫామ్‌ కోల్పోయారు కాబట్టి తొలగించాలనే డిమాండ్లూ వస్తున్నాయి’’ అని వివరించాడు. 

ఏదైనా కీలకమైన సిరీస్‌ మధ్యలో జట్టులో మార్పులు, చేర్పులు చేస్తే ఆటపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. రహానె, పుజారా పరుగులు చేయకపోవడం జట్టుకు ఇబ్బందికరమేనని పేర్కొన్నాడు. అయితే సిరీస్‌ మధ్యలో ఆటగాళ్లను మార్చడమనేది అతిపెద్ద నిర్ణయమని, జట్టుపై ఎలా ప్రభావం ఉంటుందనేది కూడా ఆలోచించుకోవాలని నెహ్రా సూచించాడు. మరోవైపు రెండో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని