Ravichandran Ashwin: తొలి గంటలోనే యాష్‌తో బౌలింగ్‌ చేయించొచ్చు!

ఇంగ్లాండ్‌ సిరీసులో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడాల్సిన సమయం వచ్చేసిందని టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఆంగ్లేయులను తన స్పిన్‌తోనే కాకుండా మానసికంగానూ అతడు దెబ్బతీయగలడని పేర్కొన్నాడు. ..

Published : 02 Sep 2021 13:51 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ సిరీసులో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడాల్సిన సమయం వచ్చేసిందని టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఆంగ్లేయులను తన స్పిన్‌తోనే కాకుండా మానసికంగానూ అతడు దెబ్బతీయగలడని పేర్కొన్నాడు. అందులోనూ ఎడమచేతివాటం ఆటగాళ్లను యాష్ సులువుగా బుట్టలో పడేస్తాడని వెల్లడించాడు. నాలుగో టెస్టుకు ముందు అతడు డైలీ టెలిగ్రాఫ్‌కు ఓ కథనం రాశాడు.

‘అశ్విన్‌ ఆడేందుకు సమయం వచ్చేసింది. ఇంగ్లాండ్‌లోని ఫ్లాట్‌ పిచ్‌ల్లో ఓవల్‌ ఒకటి. ఎప్పట్లాగే ఈ సీజన్లోనూ వికెట్లో పెద్ద మార్పులేమీ లేవు. ఇక్కడ సర్రే ఆడిన ఐదు మ్యాచుల్లో మూడింట్లో ఫలితం తేల్లేదు. ఆ మ్యాచుల్లో ఏకంగా పది శతకాలు నమోదయ్యాయి’ అని కార్తీక్‌ అన్నాడు. అశ్విన్‌ బౌలింగ్‌లోని వైవిధ్యం ఓవల్‌ మైదానంలో సాయపడుతుందని అతడు అంచనా వేశాడు.

‘నేనే విరాట్‌ కోహ్లీనైతే కీలకమైన ఈ టెస్టులో సరికొత్త సమీకరణాలు తీసుకొస్తా. నిజానికి అశ్విన్‌ తన కెరీర్లో ఎప్పుడూ పిచ్‌లపై ఆధారపడలేదు. తన ప్రతిభతో వికెట్లు తీశాడు. పైగా ఇంగ్లాండ్‌ టాప్‌-3లో ఇద్దరు, టాప్‌-7లో ముగ్గురు ఎడమ చేతివాటం ఆటగాళ్లు ఉన్నారు. ఎడమ చేతివాటం వారిపై యాష్‌కు ఉన్న రికార్డు మరెవ్వరికీ లేదు. అంతేకాకుండా నకుల్‌ బంతి, ఫ్లోటర్స్‌తో అతడు కుడిచేతి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు’ అని కార్తీక్‌ తెలిపాడు.

‘ఆస్ట్రేలియాలో కూకాబుర్ర బంతిని అశ్విన్‌ అద్భుతంగా డ్రిఫ్ట్‌ చేశాడు. పిచ్‌ అయ్యే ముందరే గాల్లో బంతిని సుడులు తిప్పాడు. స్టీవ్‌స్మిత్‌, లబుషేన్‌ను అతడదే విధంగా ఔట్‌ చేశాడు. అంతేకాకుండా యాంగిల్స్‌తో మాయ చేసేందుకు వికెట్లకు రెండు వైపుల నుంచి బంతులు విసురుతాడు. ఆసీస్‌ పిచ్‌ల మాదిరిగానే ఓవల్‌లో బౌన్స్‌ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని అతడు వికెట్లు తీయగలడు. అశ్విన్‌తో ఆరంభ ఓవర్లు వేయించొచ్చు. పిచ్‌పై కాస్త చిత్తడిగా ఉండి తొలి గంటలోనే యాష్‌తో బౌలింగ్‌ చేస్తే అతడో ఆయుధంగా మారతాడు’ అని డీకే వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు