Virat Kohli - Ashwin: ఇదేందయ్యా ఇది! యాష్‌కు చోటివ్వరా ఏంటి? విరాట్‌పై విమర్శలు..

టీమ్‌ఇండియా అభిమానులకు షాకిచ్చాడు విరాట్‌ కోహ్లీ! ఇంగ్లాండ్‌ సిరీసులో వరుసగా నాలుగో మ్యాచులో అశ్విన్‌కు చోటివ్వలేదు....

Published : 03 Sep 2021 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా అభిమానులకు షాకిచ్చాడు విరాట్‌ కోహ్లీ! ఇంగ్లాండ్‌ సిరీసులో వరుసగా నాలుగో మ్యాచులో అశ్విన్‌కు చోటివ్వలేదు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకే ఇష్టపడుతున్న కోహ్లీ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ కూర్పునే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో పిచ్‌లు పేసర్లకు సహకరించాయి. ఐతే మూడో టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలవ్వడంతో నాలుగో టెస్టులో యాష్‌ను తీసుకోవాలని విశ్లేషకులు సూచించారు.

ప్రస్తుతం జరుగుతున్న ఓవల్‌ పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుందని చరిత్ర చెబుతోంది. పేస్‌కు అంతగా అనుకూలించదని అంటారు. దేశవాళీ క్రికెట్లో సరే అక్కడ ఐదు మ్యాచులు ఆడగా మూడింట్లో ఎవరినీ విజయం వరించలేదు. పిచ్‌ అనుకూలత, ఇంగ్లాండ్‌ జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం, వైవిధ్యమైన బంతులు వేయగల అనుభవం ఉండటంతో యాష్‌కు చోటు దొరుకుతుందని చాలామంది అంచనా వేశారు.

కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో కూడిన జట్టు యాజమాన్యం మాత్రం ఆఖర్లో షాకిచ్చారు. ఎడమచేతి వాటం బ్యాటర్లపై జడేజా ప్రభావం చూపిస్తాడని కోహ్లీ చెబుతున్నాడు. నాలుగో టెస్టులో శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ను తీసుకున్నాడు. అయితే ఓవల్‌ పిచ్‌ గతానికి భిన్నంగా పచ్చికతో కనిపించడం, వాతావరణం చల్లగా ఉండటంతో అతడీ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోంది. కానీ అభిమానులు, విశ్లేషకులు మాత్రం ఊరుకోవడం లేదు. సోషల్‌ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. జో రూట్‌పై అతడు మానసికంగా పైచేయి సాధిస్తాడని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని