Ashes Series: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ టిమ్‌పైన్‌కు ఎనిమిదోసారి సర్జరీ!

ఇంగ్లాండ్‌తో కీలకమైన యాషెస్‌ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ టిమ్‌పైన్‌ ఎనిమిదోసారి సర్జరీ చేయించుకోనున్నాడు. కొద్దికాలంగా తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్న...

Published : 14 Sep 2021 01:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో కీలకమైన యాషెస్‌ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ టిమ్‌పైన్‌ ఎనిమిదోసారి సర్జరీ చేయించుకోనున్నాడు. కొద్దికాలంగా తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్న అతడు మంగళవారం శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, యాషెస్‌ సిరీస్‌ వరకు అతడు పూర్తిగా కోలుకొని జట్టును నడిపిస్తాడని తెలిసింది. పైన్‌ మెడలోని ఓ నరం తీవ్ర ఒత్తిడికి గురికావడంతో కొద్ది రోజులుగా నొప్పిని భరిస్తున్నాడని, అందుకే ఇటీవల జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ పాల్గొనలేదని ఒక ఆస్ట్రేలియా క్రికెట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.

వెన్నెముక వైద్య నిపుణులు, క్రికెట్‌ ఆస్ట్రేలియా వైద్య బృందం పూర్తిగా పరిశీలించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ మాట్లాడుతూ తాను ఈనెలాఖరు కల్లా కోలుకుంటానని, అక్టోబర్‌ నుంచి పూర్తిస్థాయిలో ఇంగ్లాండ్‌తో యాషెస్‌ కోసం సన్నద్ధమవుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ ప్రతిష్ఠాత్మక సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. కాగా, టిమ్‌పైన్‌ గతంలో తన చేతి వేలికి గాయమై ఏడుసార్లు సర్జరీ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో 2017లోనే అతడి కెరీర్‌ ముగిసిపోతుందనుకున్న పరిస్థితుల్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. ఆపై టెస్టు కెప్టెన్సీ చేపట్టి ఆ జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని