Paralympics: అదరగొట్టిన అవని .. భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణం

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలోకి తొలి స్వర్ణం వచ్చి చేరింది.

Updated : 30 Aug 2021 09:14 IST

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలోకి తొలి స్వర్ణం వచ్చి చేరింది. మహిళా షూటర్‌ అవని లేఖరా అదరగొట్టింది. 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఆమె బంగారు పతకం సాధించింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత తొలి మహిళగా అవని రికార్డు సృష్టించింది. డిస్కస్‌త్రోలో వినోద్‌ మెరిశాడు కానీ మూడో స్థానంలో నిలిచిన అతడికి కాంస్య పతకంపై నేడు స్పష్టత రానుంది.

అవని లేఖరా నేపథ్యం ఇదీ..

జైపురకి చెందిన పందొమ్మిదేళ్ల రైఫిల్‌ షూటర్‌ అవని.. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న పిన్న వయస్కురాల్లో ఒకరు. అది 2012. అప్పటికి అవనికి పదేళ్లు. ఓ కారు ప్రమాదంలో తన వెన్ను పూస విరిగిపోయింది. నడుము కింద భాగం చచ్చుబడి ఆ అమ్మాయిని చక్రాల కుర్చీకే పరిమితమైంది. మూడేళ్లపాటు ఎన్నో సర్జరీలు, ఫిజియోథెరపీ సెషన్లు...! అయినా ఫలితంలేదు. బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండేళ్లు ఇంట్లోనే చదువుకుంది. తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు దొరికింది. ‘బాధను దిగమింగుకోవడం సులువు కాలేదు. మనసు మళ్లేందుకు ఏదైనా రంగంలో పట్టు సాధించాలని నిర్ణయించుకున్నా. అదే నాన్న సూచన కూడా. ఆయనోసారి ఆర్చరీ, షూటింగ్‌ రేంజ్‌లకు తీసుకెళ్లారు. అక్కడ మొదటిసారి రైఫిల్‌ని చేతితో తాకినప్పుడే దాంతో ప్రేమలో పడిపోయాను. నాలో స్ఫూర్తినింపడానికి ఆయన... అభినవ్‌ బింద్రా రాసిన ‘ఎ షాట్‌ ఎట్‌ హిస్టరీ’ పుస్తకం ఇచ్చారు. అది చదివాక సీరియస్‌గా సాధన ప్రారంభించా. ఎప్పటికైనా దేశానికి బంగారు పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అంటోంది అవని. గత కొన్నేళ్లుగా అవని సాధించిన విజయాలు ఆమె పట్టుదలకు నిదర్శనం. శిక్షణ తీసుకున్న మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో మూడు పతకాలు అందుకుంది. అప్పటికి ఆమెకో సొంత రైఫిల్‌ కూడా లేదు. కోచ్‌ దగ్గర అరువు తెచ్చుకుంది. 2017లో ఆన్‌ఐన్‌ఓలో జరిగిన పారా షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో రజతాన్ని అందుకుంది. కరోనా కారణంగా గతేడాదిగా ఫిజియోథెరపీ సెషన్‌లు ప్రభావితమైనా, సరైన శిక్షణా, సదుపాయాలు, పరికరాలు లేకపోయినా ఇంటి దగ్గరే సాధన చేసి పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని