IND vs PAK: కోహ్లీతో మాట్లాడింది నిజమే.. కానీ అందరిముందు ఎలా చెప్తా?

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ ఏం మాట్లాడుకున్నారన్నది మరోసారి వార్తలకెక్కింది...

Published : 14 Dec 2021 11:41 IST

రిపోర్టర్‌ ప్రశ్నకు బాబర్‌ అజామ్‌ సమాధానం..

కరాచి: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ ఏం మాట్లాడుకున్నారన్నది మరోసారి వార్తలకెక్కింది. సోమవారం కరాచి వేదికగా పాకిస్థాన్‌ జట్టు వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్‌ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌.. బాబర్‌ను ఉద్దేశించి ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాతో మ్యాచ్‌ గెలిచాక కెప్టెన్‌ కోహ్లీతో ఏం మాట్లాడారో తెలుసుకోవాలని ఉందని అన్నాడు. దీనికి స్పందించిన పీసీబీ మీడియా మేనేజర్‌.. ఈ ప్రెస్‌మీట్‌ విండీస్‌ పర్యటనకు సంబంధించినదని, అందుకు సంబంధించిన ప్రశ్నలే అడగాలన్నాడు.

ఆ రిపోర్టర్‌ తిరిగి స్పందిస్తూ.. ‘నేను అడిగిన దాంట్లో వివాదాస్పదమైంది ఏదీ లేదు, ఇది చాలా చిన్న ప్రశ్న. కోహ్లీ-బాబర్‌ మధ్య ఏం సంభాషణ జరిగిందో నాకు తెలుసుకోవాలని ఉంది. దీనికి ఇష్టమైతే బాబర్‌ సమాధానం ఇవ్వాలి’ అని కోరాడు. చివరికి దీనిపై స్పందించిన పాక్‌ కెప్టెన్‌.. ‘మేం మ్యాచ్‌ గెలిచాక మా ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందనేది వాస్తవమే. కానీ, అందరిముందూ నేనెందుకు దాన్ని బయటపెడతా?’ అని బదులిస్తూ ఆ ప్రశ్నను తోసిపుచ్చాడు. ఇక తర్వాత టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్‌.. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడంపై ప్రశ్న అడగ్గా.. దానికి కూడా బాబర్‌ స్పందించలేదు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా.. పాకిస్థాన్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ వేసేటప్పుడు, మ్యాచ్‌ ముగిశాక కోహ్లీ-బాబర్‌ మాట్లాడుకున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అయ్యాయి. దీనిపైనే పాక్‌ రిపోర్టర్‌ ప్రశ్నలు వేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని