IPL 2021: సిక్సర్‌ బాదితే మరో బంతి.. బీసీసీఐ కఠిన నిర్ణయాలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను విజయవంతం చేసేందుకు బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఏ మాత్రం కరోనా వైరస్‌కు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. అన్ని వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది....

Published : 10 Aug 2021 14:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను విజయవంతం చేసేందుకు బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఏ మాత్రం కరోనా వైరస్‌కు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. అన్ని వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ఆటగాళ్లు ఎవరైనా సిక్సర్‌ బాదితే ప్రత్యామ్నాయ బంతిని ఇవ్వనుందని తాజా సమాచారం.

ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాట్స్‌మెన్‌ సిక్సర్లు బాదితే స్టాండ్స్‌లోకి వెళ్లిన బంతిని అంపైర్లు వెంటనే శానిటైజ్‌ చేస్తున్నారు. బీసీసీఐ అంతకు మించే జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. ఏకంగా మరో బంతిని ఇవ్వనుందని అంటున్నారు. నిజానికి బంతి వల్ల కొవిడ్‌ వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ బీసీసీఐ ఏ మాత్రం రిస్క్‌ తీసుకోవాలని భావించడం లేదు.

‘ఒకవేళ బంతి స్టాండ్స్‌ లేదా స్టేడియం అవతల పడితే నాలుగో అంపైర్‌ మరో బంతిని ఇస్తారు. అంతకు ముందు బంతి దొరకగానే దానిని ఆల్కహాల్‌ ఆధారిత వైప్స్‌ లేదా యూవీ-సీతో శుభ్రపరుస్తారు. మళ్లీ బంతుల లైబ్రరీలో చేర్చుతారు’ అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆటగాళ్లు మైదానంలో ఉమ్మి వేయడాన్నీ బీసీసీఐ నిషేధించనుందని తెలిసింది. ఇందుకోసం టిష్యూ పేపర్లను వారికి అందివ్వనుంది. వాటిని ఆటగాళ్లే జాగ్రత్తగా చెత్త కుండీలో వేయాలి. లీగ్‌ కోసం యూఏఈలో 14 బయో బుడగలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని