Updated : 14 Sep 2021 12:31 IST

Team India: రవిశాస్త్రిపై చర్యలు ఉంటాయా? గంగూలీ ఏం చెప్పాడంటే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా శాస్త్రి ఓవల్‌లోని హోటల్లో  బసచేస్తుండగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, పుస్తకావిష్కరణకు సంబంధించి బీసీసీఐ నుంచి అనుమతి పొందలేదని.. అయినా రవిశాస్త్రిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని గంగూలీ ఓ అంతర్జాతీయ పత్రికతో అన్నాడు.

‘ఎవరైనా ఎంతసేపని హోటల్‌ గదిలో ఉంటారు? మీరు ఒక రోజు మొత్తం ఇంట్లో, మరోరోజు మొత్తం బయట ఉండగలరా?ఎవరైనా హోటల్‌ గదిలో ఎక్కువ సమయం ఉన్నప్పుడు కిందకి వెళ్లకుండా ఆపలేం. అది జరగని పని. నేను తాజాగా ఒక షూటింగ్‌లో పాల్గొన్నాను. అక్కడొక 100 మంది ఉన్నారు. అందరూ డబుల్‌ డోస్‌ వాక్సిన్‌ తీసుకున్నారు. అయినా, ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. వాక్సినేషన్‌ తీసుకున్నా చాలా మంది వైరస్‌బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన జీవన విధానం ఇలా ఉంది’ అని గంగూలీ స్పందించాడు.

మరోవైపు ఐదో టెస్టుకు ముందు టీమ్‌ఇండియా ఆటగాళ్లు భయపడ్డారని, తమతో ప్రాక్టీస్‌ సెషన్‌లో సన్నిహితంగా మెలిగిన ఫిజియో యోగేశ్‌ పార్మర్‌కు పాజిటివ్‌గా తెలియడంతో కంగారు పడ్డారని దాదా పేర్కొన్నాడు. తొలుత నాలుగో టెస్టు సందర్భంగా శాస్త్రికి పాజిటివ్‌గా తేలింది. ఆపై బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌తో పాటు మరో ఫిజియో నితిన్‌ పటేల్‌ సైతం వైరస్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఐదో టెస్టుకు ముందు యోగేశ్‌కు కూడా నిర్ధరణ కావడంతో ఆటగాళ్లు భయపడి మ్యాచ్‌లో ఆడలేదని గంగూలీ వివరించాడు. అందులో వాళ్లను తప్పుపట్టాల్సిన అవసరం లేదని, వాళ్ల మనసుల్ని అర్థం చేసుకోవాలని తెలిపాడు. అలాగే రద్దయిన చివరి టెస్టును భవిష్యత్తులో ఎప్పుడు నిర్వహించినా.. దాన్ని ఐదో టెస్టుగానే పరిగణించాలని మాజీ సారథి అభిప్రాయపడ్డాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts