BCCI : రంజీ ట్రోఫీ సహా దేశవాళీ పోటీలు వాయిదా: బీసీసీఐ

దేశంలో కరోనా కేసులు, ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో...

Published : 04 Jan 2022 22:59 IST

ముంబయి: దేశంలో కరోనా కేసులు, ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రంజీ ట్రోఫీతో సహా దేశవాళీ టోర్నమెంట్లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ వాయిదా పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటన విడుదల చేసింది. ‘‘రంజీ ట్రోఫీ, కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ, సీనియర్‌ మహిళల టీ20 లీగ్ సహా ఇతర దేశవాళీ పోటీలను కొవిడ్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేస్తున్నాం. రంజీ, కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలు ఈనెలలోనే ఆరంభం కావాల్సి ఉంది. అలానే సీనియర్ మహిళల టీ20 లీగ్ షెడ్యూల్‌ ఫిబ్రవరిలో ఉంది’’ అని బీసీసీఐ పేర్కొంది. 

క్రికెటర్లు, సహాయక సిబ్బంది, అధికారుల భద్రతకు సంబంధించి రాజీపడే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆటలో భాగమయ్యే ప్రతి ఒక్కరి ఆరోగ్యరీత్యా పోటీలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మళ్లీ షెడ్యూల్‌ రూపొందిస్తామని వెల్లడించింది. ప్రస్తుత సీజన్‌ 2021-22లో దేశీయంగా పదకొండు టోర్నీలు, 700కిపైగా మ్యాచ్‌లను నిర్వహించేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, రాష్ట్ర సంఘాలు, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్‌ల అధికారులకు ధన్యవాదాలు చెబుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని