Yuvraj Singh: ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ఫీల్డ్‌.. ఎక్కడైనా యువీ పోరాట యోధుడు..!

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆదివారం 40వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి....

Updated : 12 Dec 2021 14:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆదివారం 40వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో సహా పలువురు మాజీ క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో ఛాంపియన్‌కు ప్రత్యేకంగా విషెస్‌ చెప్పారు. మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌ 11,778 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 148 వికెట్లు పడగొట్టి మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు.

ఈ సందర్భంగా ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబయి ఇండియన్స్‌ యువీలోని పోరాటపటిమను గుర్తుచేస్తూ అతడికి ప్రత్యేకంగా విషెస్‌ చెప్పింది. ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ఫీల్డ్‌.. యువరాజ్‌ ఎక్కడైనా పోరాట యోధుడే అంటూ కొనియాడింది. ఈ మాజీ ఆల్‌రౌండర్‌.. 2011 వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్యాన్సర్‌ బారినపడిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం జట్టులోకి తిరిగొచ్చి మళ్లీ మునుపటిలా రాణించాడు. పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ నేపథ్యంలోనే ముంబయి జట్టు అతడిని ఫైటర్‌ అంటూ ప్రశంసించింది. అలాగే 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది. అయితే, 2019 వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి టీమ్‌ఇండియా యాజమాన్యం అతడిని ఎంపికచేయకపోవడంతో నిరాశకు గురయ్యాడు. కొద్దిరోజులకే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆపై పలు లీగ్‌ టోర్నీల్లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు.









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని