IND vs ENG: వచ్చిందే 4 పాయింట్లు.. అందులో 2 కోత.. మండిపడ్డ అభిమానులు!

భారత్‌, ఇంగ్లాండ్‌కు మరోసారి షాకులు తగిలాయి! ఇప్పటికే ఆటగాళ్ల గాయాలతో సతమతం అవుతున్న జట్లపై జరిమానా పడింది. తొలి టెస్టులో నెమ్మదిగా ఓవర్లు వేయడమే  ఇందుకు కారణం....

Published : 11 Aug 2021 14:01 IST

దుబాయ్‌: భారత్‌, ఇంగ్లాండ్‌కు మరోసారి షాకులు తగిలాయి! ఇప్పటికే ఆటగాళ్ల గాయాలతో సతమతం అవుతున్న జట్లపై జరిమానా పడింది. తొలి టెస్టులో నెమ్మదిగా ఓవర్లు వేయడమే ఇందుకు కారణం. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2లో తొలి మ్యాచుకే ఇలా జరగడం గమనార్హం.

నాటింగ్‌హామ్‌ వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఆఖరి రోజు వర్షం కారణంగా ఆట సాగలేదు. అంతకు ముందూ వరుణుడు అంతరాయం కలిగించాడు. ఫలితంగా విజయం సాధించాల్సిన కోహ్లీసేన 12 పాయింట్లు నష్టపోయింది! అయితే వాతావరణం బాగాలేకపోవడం, ఇతర ఇబ్బందులతో రెండు జట్లు నెమ్మదిగా ఓవర్లు వేశాయి. దాంతో రిఫరీ క్రిస్‌బ్రాడ్‌ రెండు జట్ల మ్యాచు ఫీజులో 40% కోత విధించారు. అంతేకాకుండా వారికి లభించిన నాలుగు పాయింట్లలో చెరో రెండు పాయింట్లు కోత పెట్టారు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2లో మొదటి మ్యాచ్‌ భారత్‌, ఇంగ్లాండే ఆడాయి. గెలిచిన జట్టుకు 12, మ్యాచ్‌ టై అయితే 6 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే మాత్రం 4 పాయింట్లు లభిస్తాయి. తొలి టెస్టు డ్రా కావడంతో రెండు జట్లు చెరో నాలుగు పాయింట్లతో నిలిచాయి. ఇప్పుడు 2 పాయింట్ల కోత విధించడంతో చెరో 2 పాయింట్లతో పట్టికలో నిలిచాయి. ఫైనల్‌ మ్యాచుకు అర్హత సాధించే క్రమంలో ఈ పాయింట్ల కోత ఇబ్బంది కలిగించే అవకాశం లేకపోలేదు.

నెమ్మది ఓవర్ల కారణంగా కోత విధించడం అభిమానులకు నచ్చడం లేదు. ఐసీసీ తీరును వారు విమర్శిస్తున్నారు. మరి వాతావరణం బాగా లేకపోవడం, వర్షంతో ఆఖరి రోజు ఆట సాగకపోవడంపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వర్షం కురిసినందుకు మ్యాచు ఫీజు, పాయింట్లలో కోత లేదా? అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని