Ravi shastri: శాస్త్రికి కరోనా అని తెలియగానే కుర్రాళ్లు ఎలా కలత చెందారంటే..!

రవిశాస్త్రికి కొవిడ్‌-19 వచ్చిందని తెలియడంతో టీమ్‌ఇండియా కుర్రాళ్లంతా కలవరపడ్డారని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. మ్యాచులో మెరుగైన స్థితిలో ఉండటం అవసరం కాబట్టి తిరిగి ఏకాగ్రతతో ఆడారని పేర్కొన్నాడు...

Updated : 06 Sep 2021 10:19 IST

లండన్‌: రవిశాస్త్రికి కొవిడ్‌-19 వచ్చిందని తెలియడంతో టీమ్‌ఇండియా కుర్రాళ్లంతా కలవరపడ్డారని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. మ్యాచులో మెరుగైన స్థితిలో ఉండటం అవసరం కాబట్టి తిరిగి ఏకాగ్రతతో ఆడారని పేర్కొన్నాడు. శనివారం సాయంత్రం నుంచే శాస్త్రి అసౌకర్యంగా కనిపించారని వెల్లడించాడు. నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు.

ఇంగ్లాండ్‌, భారత్‌ నాలుగో టెస్టు రసవత్తరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు అద్భుతంగా ఆడిన టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ శతకానికి తోడుగా చెతేశ్వర్‌ పుజారా, శార్దూల్‌ ఠాకూర్‌, రిషభ్‌పంత్‌ కీలకమైన అర్ధశతకాలు బాదేశారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఉమేశ్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా సైతం సమయోచితంగా పరుగులు చేశారు. అయితే ఆట ఆరంభానికి ముందు రవిశాస్త్రికి కొవిడ్‌-19 సోకినట్టు తెలిసింది. అతడితో సన్నిహితంగా మెలిగిన బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌, ఫిజియోథెరపిస్టు నితిన్‌ పటేల్‌ను ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌కు పంపించారు. కోచ్‌ల మద్దతు లేకుండానే టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ చేసింది.

‘నిజమే, మేం వారి సేవలను మిస్సయ్యాం. రవి భాయ్‌, అరుణ్‌, శ్రీధర్‌ ఈ జట్టుకు అత్యంత కీలకం. ఐదారేళ్లుగా వారు జట్టు ప్రదర్శనలో కీలకంగా ఉన్నారు. కానీ జరిగిన దాన్ని మనం అడ్డుకోలేం. ఏదేమైనా వారీ సమయంలో మా వద్ద లేరు. అందుకే ఆదివారం ఉదయం ఆటగాళ్లు కాస్త కలత చెందారు. మా చేతుల్లో ఏం లేదని భావించాం. ఏకాగ్రతతో క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నాం’ అని రాఠోడ్‌ తెలిపాడు.

‘మేమీ సిరీసు ఆడేందుకు వచ్చాం. మాకు ఈ సిరీసు ఎంతో కీలకం. నాలుగో రోజు అత్యంత కీలకమని మాకు తెలుసు. అందుకే క్రికెట్‌పై దృష్టిసారించాం. కుర్రాళ్లు సైతం అదరగొట్టారు. శనివారం రాత్రి జరిగిన పరిణామాలతో ఆటగాళ్లు కలతపడతారని తెలుసు. దానిని అధిగమించి రాణించినందుకు వారికి అభినందనలు’ అని రాఠోడ్‌ అన్నాడు.

శనివారం టెస్టు చేయగానే రవిశాస్త్రి అసౌకర్యంగా కనిపించాడని రాఠోడ్‌ తెలిపాడు. ‘కచ్చితంగా సమయమెంతో చెప్పలేను. రాత్రి 8 గంటలకు అనుకుంటా. శాస్త్రి కొద్దిగా నలతగా కనిపించాడు. దాంతో వైద్యబృందం మళ్లీ టెస్టు చేసింది. అందులో పాజిటివ్‌ వచ్చింది. ఆ విషయం తెలియగానే సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేషన్‌కు పంపించారు. మళ్లీ వారెప్పుడు జట్టుతో కలుస్తారో వైద్య బృందం చెప్తుంది’ అని రాఠోడ్‌ వెల్లడించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts