Pakistan Cricket: పాక్‌ పర్యటనకు రావొద్దని మేం ఇంగ్లాండ్‌కు చెప్పలేదు

పాకిస్థాన్‌లో భద్రతా కారణాల రిత్యా అక్కడికి రావొద్దని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుకు తాము చెప్పలేదని ఇస్లామాబాద్‌లోని బ్రిటిష్‌ హై కమిషనర్‌ క్రిస్టియన్‌ టర్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...

Published : 22 Sep 2021 12:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌లో భద్రతా కారణాల రీత్యా అక్కడికి రావొద్దని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుకు తాము చెప్పలేదని ఇస్లామాబాద్‌లోని బ్రిటిష్‌ హై కమిషనర్‌ క్రిస్టియన్‌ టర్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్‌ పురుషులు, మహిళల జట్లు అక్టోబర్‌లో పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, గతవారం న్యూజిలాండ్‌.. పాక్‌ పర్యటన నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగాక ఇంగ్లాండ్‌ బోర్డు సైతం తమ ప్లేయర్లను అక్కడికి పంపబోమని సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా సామాజిక మాధ్యమాల్లో  పాకిస్థాన్‌లోని బ్రిటిష్‌ హై కమిషనర్‌ స్పందించారు.

‘అక్టోబర్‌లో ఇంగ్లాండ్‌-పాక్‌ మ్యాచ్‌లు జరగవని చెప్పడానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ నిర్ణయం ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు తీసుకుంది. అది కూడా ఆటగాళ్ల క్షేమం కోసమే తప్ప మరే కారణం కాదు. అయితే, మా బ్రిటిష్‌ హై కమిషన్‌ ఈ పర్యటనకు పూర్తి మద్దతు తెలుపుతోంది. భద్రతా కారణాలతో పాకిస్థాన్‌ పర్యటనకు రావొద్దని మేం ఇంగ్లాండ్‌ జట్టుకు చెప్పలేదు’ అని టర్నర్‌ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

అంతకుముందు పాకిస్థాన్‌ క్రికెట్‌ చీఫ్‌ రమీజ్‌ రజా మాట్లాడుతూ ఇంగ్లాండ్‌ కూడా పాక్‌ పర్యటనను రద్దు చేసుకోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని, కానీ అది ఊహించిందేనని తెలిపారు. దురదృష్టవశాత్తూ ఇలాంటి పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాలు ఒకదానికి ఒకటి మద్దతుగా నిలుస్తాయన్నారు. ముందుగా న్యూజిలాండ్‌కు తలెత్తిన ముప్పు గురించి ఏ సమాచారం పంచుకోకుండానే తిరిగి స్వదేశం వెళ్లిపోవడం ఆగ్రహం తెప్పించిందని, ఇప్పుడు ఇంగ్లాండ్‌ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుందని అన్నారు. ఆ రెండు జట్లు వచ్చినపుడు బాగా ముద్దు చేసే తమకు ఇదో గుణపాఠమని మండిపడ్డారు. ఈ నిర్ణయాలు ఇతర దేశాల పర్యటనలపై ప్రభావం చూపుతాయని వాపోయారు. ఈ నేపథ్యంలోనే తమకు మంచి చేయని న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ జట్లను ఓడించి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్‌ జట్టుకు రమీజ్‌ సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని