Tokyo Olympics: పంజాబ్‌ హాకీ ఆటగాళ్లకు కోటి నజరానా.. ఇళ్ల వద్ద తల్లిదండ్రుల భావోద్వేగం

భారత హాకీ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశం యావత్తు వారిని చూసి గర్విస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌, హరియాణాల్లో ఆటగాళ్ల ఇళ్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది...

Published : 05 Aug 2021 13:30 IST

దిల్లీ: భారత హాకీ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశం యావత్తు వారిని చూసి గర్విస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌, హరియాణాల్లో ఆటగాళ్ల ఇళ్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. జట్టులోని పంజాబ్‌ ఆటగాళ్లు ఒక్కొక్కరికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఆ రాష్ట్ర క్రీడా మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధి ఈ విషయం ప్రకటించారు.

‘భారత హాకీలో ఇదొక మరిచిపోలేని రోజు. పంజాబ్‌ నుంచి ప్రాతినిథ్యం వహించిన ప్రతి ఆటగాడికి కోటి రూపాయలు నజరానా ప్రకటించడం ఆనందంగా ఉంది. పతకంతో ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు తిరిగొస్తారా అని ఎదురుచూస్తున్నాం’ అని గుర్మీత్‌సింగ్‌ అన్నారు.

భారత హాకీ జట్టులో ఎనిమిది మంది పంజాబీలు ఉన్నారు. కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, రూపిందర్‌పాల్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, శంషీర్‌ సింగ్‌, దిల్‌ప్రీత్‌ సింగ్‌, గుర్జంత్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌ పంజాబ్‌కు చెందినవారే. స్వర్ణం గెలిస్తే ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు అందజేస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. ఇప్పుడు కాంస్యం తేవడంతో కోటి రూపాయలు ఇవ్వనుంది.

ఆనందం.. మిఠాయి పంపిణీ

తమ బిడ్డలు సాధించిన విజయాన్ని చూసి ఆటగాళ్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గర్వపడుతున్నారు. ఇంటి వద్ద సందడి చేస్తున్నారు. మిఠాయిలు పంచుకొంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ ఉదయాన్నే ఇంటికి ఫోన్‌ చేసి తప్పకుండా పతకం గెలుస్తామని చెప్పాడట. ‘మన్‌ప్రీత్‌ ఉదయాన్నే ఫోన్‌ చేశాడు. జట్టు పతకం గెలుస్తుందని చెప్పాడు’ అని అతడి తల్లి మంజీత్‌ కౌర్‌ పేర్కొన్నారు. మ్యాచ్‌ ముగిశాక ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లూ తన కొడుకు పడ్డ కష్టాలకు తగిన ఫలితం వచ్చిందని ఆనందించారు. వారు జలంధర్‌లో ఉంటారు.

మ్యాచ్‌ గెలిచాక కుటుంబ సభ్యులు హాకీ ఆటగాళ్లకు వీడియో కాల్‌ చేశారు. భాంగ్రా నృత్యాలు చేస్తూ ఆనందం పంచుకున్నారు. వారిని అభినందించారు. కురుక్షేత్రలోని సురేందర్‌ కుమార్‌ తల్లి అతడికి వీడియో కాల్‌ చేసి ఆనంద బాష్పాలు కార్చారు. ఇక అమృతసర్‌లోని గుర్జంత్‌ సింగ్‌, శంషీర్‌ కుటుంబీకులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

బెల్జియంతో సెమీస్‌లో ఓడినప్పుడు తాము నిరాశపడ్డామని రూపిందర్‌ తల్లి తెలిపారు. జర్మనీపై గెలిచి కాంస్యం సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఫరీద్‌కోట్‌ మొత్తం తన కొడుకు రాకకోసం ఎదురు చూస్తోందని రూపిందర్‌ తండ్రి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని