IND vs SA: దక్షిణాఫ్రికాలో గెలవాలంటే ఇదే మంచి అవకాశం: పుజారా

దక్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ సాధించాలంటే ఇదే మంచి అవకాశమని సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఇటీవలి కాలంలో...

Published : 20 Dec 2021 01:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ సాధించాలంటే ఇదే మంచి అవకాశమని సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఇటీవలి కాలంలో.. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా లాంటి విదేశీ పిచ్‌లపై రాణించిందని, అలాంటిది ఈసారి దక్షిణాఫ్రికాలోనూ సత్తా చాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలర్లు కూడా కొన్నేళ్లుగా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారని తెలిపాడు. దీంతో ఇప్పుడు కూడా చెలరేగుతారని పుజారా చెప్పుకొచ్చాడు. వాళ్లే జట్టుకు బలమని అభిప్రాయపడ్డాడు.

ఇక ఈ పర్యటనలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు లేకపోవడంపై స్పందించిన పుజారా.. ఇక్కడికి వచ్చేముందే టీమ్‌ఇండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడిందని గుర్తుచేశాడు. దీంతో తమ ఆటగాళ్లు చాలా మంది ఫామ్‌లో ఉన్నారని తెలిపాడు. అలాగే ఈ టెస్టు సిరీస్‌ మొదలవ్వడానికి ఇంకా ఐదు రోజుల సమయం మిగిలి ఉండటంతో జట్టు సన్నద్ధం అయ్యేందుకు తగినంత సమయం ఉందన్నాడు. ఈ సిరీస్‌ కోసం తమ ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పాడు. మరోవైపు టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో ఇదివరకు ఎప్పుడూ టెస్టు సిరీస్‌ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఈసారి చరిత్ర సృష్టించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కాగా, రెండేళ్లుగా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేక ఇబ్బందులు పడుతున్న పుజారాకు ఈ సిరీస్‌ ఒక విధంగా చావో రేవోలాంటిది. ఈ సిరీస్‌లోనూ రాణించకపోతే అతడిని పక్కకు పెట్టే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని