
IPL 2021: శార్దూల్ ఠాకూర్‌కు బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్.. జీవితంలో మర్చిపోలేడు
ఇంటర్నెట్‌డెస్క్: ఇది తనకు జీవితాంతం గుర్తుండిపోయే పుట్టినరోజు బహుమతి అంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశాడు. గతరాత్రి ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు నాలుగోసారి టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం శార్దూల్ మాట్లాడుతూ ఇదే తనకు అత్యుత్తమ బర్త్‌డే గిఫ్ట్ అని సంబరపడ్డాడు. చెన్నై ఈ మ్యాచ్ గెలిచిన కాసేపటికే ఈ పేస్ ఆల్‌రౌండర్ 30వ జన్మదినంలోకి అడుగుపెట్టాడు. దీంతో జట్టు సభ్యులంతా అతడి పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోను ఆ ఫ్రాంఛైజీ ట్విటర్లో అభిమానులతో పంచుకుంది.
చెన్నై విజయంలో శార్దూల్ ఠాకూర్ కీలకపాత్ర పోషించాడు. ధోనీసేన నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభ్‌మన్ గిల్ (51) శుభారంభం చేశారు. 10 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించి జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. ఈ క్రమంలోనే శార్దూల్ 11వ ఓవర్ బౌలింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీశాడు. దీంతో ఒక్కసారిగా చెన్నై పోటీలోకి వచ్చింది. తొలుత నాలుగో బంతికి వెంకటేశ్‌ను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత ఆరో బంతికి నితీశ్ రాణా (0)ను డకౌట్ చేశాడు. అలా కోల్‌కతా 93 పరుగులకు రెండు కీలక వికెట్లను కోల్పోయింది. అనంతరం 16వ ఓవర్లోనూ శార్దూల్ మరోసారి మెరిశాడు. మిడిల్ ఆర్డర్లో కోల్‌కతాకు వెన్నెముకలా ఉండే రాహుల్ త్రిపాఠి(2)ని సైతం వెనక్కి పంపి కోల్‌కతాకు గెలుపు ఆశల్ని దూరం చేశాడు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 123/7గా నమోదైంది. ఇక చివర్లో ఫెర్గూసన్ (18), శివమ్ మావి (20) ధాటిగా ఆడినా ఉపయోగం లేకపోయింది. ఆ జట్టు 20 ఓవర్లలో 165/9 స్కోర్‌తో సరిపెట్టుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.