David Warner: కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో..

కెప్టెన్సీ నుంచి తనను తప్పించడానికి కారణమేంటో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం తనకు చెప్పలేదని డేవిడ్‌ వార్నర్‌ చెప్పాడు. తొలి అంచె ఐపీఎల్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ ఆరు మ్యాచ్‌ల్లో అయిదు

Updated : 13 Oct 2021 07:16 IST

దిల్లీ: కెప్టెన్సీ నుంచి తనను తప్పించడానికి కారణమేంటో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం తనకు చెప్పలేదని డేవిడ్‌ వార్నర్‌ చెప్పాడు. తొలి అంచె ఐపీఎల్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ ఆరు మ్యాచ్‌ల్లో అయిదు ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా.. వార్నర్‌ స్థానంలో విలియమ్సన్‌ను కెప్టెన్‌గా నియమించారు. అయినా ఆ జట్టు రాత మారలేదు. యూఏఈలోనూ ఘోరంగా విఫలమై అట్టడుగు స్థానంతో టోర్నీని ముగించింది. పేలవ ఫామ్‌లో ఉన్న వార్నర్‌కు చివరి మ్యాచ్‌ల్లో తుది జట్టులో కూడా స్థానం దక్కలేదు. ‘‘సన్‌రైజర్స్‌ యజమానులు, బేలిస్‌, లక్ష్మణ్‌, మూడీ, మురళీ అంటే నాకు గౌరవం ఉంది. ఓ నిర్ణయం తీసుకున్నారంటే.. ఏకగ్రీవంగానే తీసుకుని ఉంటారు. ఎవరు నాకు మద్దతిచ్చారో, ఎవరు ఇవ్వలేదో తెలుసుకోలేం. నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణాన్ని చెప్పకపోవడం నిరాశ కలిగించింది’’ అని వార్నర్‌ అన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోవడం కష్టమని చెప్పాడు. తాను కొన్ని మ్యాచ్‌ల్లోనే విఫలమయ్యానని అన్నాడు. ‘‘కెప్టెన్సీని తొలగించడాన్ని జీర్ణించుకోవడం కష్టం. నా ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. కానీ అన్నీ మరిచి ముందుకు సాగిపోవాల్సిందే’’ అని వార్నర్‌ చెప్పాడు. మళ్లీ సన్‌రైజర్స్‌కు ఆడడం తనకు ఇష్టమే అయినా.. అది యజమానుల చేతుల్లో ఉందని అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని