David Warner: ఏ కారణం లేకుండా తొలగించడం బాధగా ఉంది: వార్నర్

ఏ కారణం లేకుండా జట్టు నుంచి తప్పించడం, కెప్టెన్సీ నుంచి తొలగించడం లాంటివి బాధిస్తాయని ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వాపోయాడు. గతనెల ఐపీఎల్‌లో సరైన ప్రదర్శన చేయలేక ఇబ్బందులు...

Updated : 16 Nov 2021 14:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ కారణం లేకుండా జట్టు నుంచి తప్పించడం, కెప్టెన్సీ నుంచి తొలగించడం లాంటివి బాధిస్తాయని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వాపోయాడు. గతనెల ఐపీఎల్‌లో సరైన ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడిన అతడిని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ తొలుత కెప్టెన్సీ నుంచి.. ఆ తర్వాత తుది జట్టు నుంచి పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతడు 289 పరుగులతో చెలరేగి.. ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌ తనని తొలగించడంపై తొలిసారి నోరు విప్పాడు.

‘కొన్నేళ్ల పాటు అమితంగా ఇష్టపడిన జట్టు ఉన్నట్టుండి ఏ తప్పూ లేకుండా, ఏ కారణం లేకుండా నన్ను తొలగించడం, కెప్టెన్సీ నుంచి తప్పించడం చేస్తే చాలా బాధగా ఉంది. అయితే, ఈ విషయంపై నేనెలాంటి ఫిర్యాదులు చేయాలనుకోవడం లేదు. భారత్‌లో నాకెంతో మంది అభిమానులున్నారు. వారు ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. వాళ్ల కోసమే నేను ఈ ఆట ఆడుతున్నా. అభిమానులను అలరించడానికే నేను ఉన్నాను. ఎవరైనా మరింత మెరుగవ్వాలనే కోరుకుంటారు. నన్ను తొలగించడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ.. నేను ఆ ఫ్రాంఛైజీ కోసం నిరంతరం కష్టపడ్డా. రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ చేశా. నెట్స్‌లో బాగా బ్యాటింగ్‌ చేశా. అయితే, సమయానికి పరుగులు చేయలేకపోయా. అలాంటప్పుడు నన్ను తీసేయడం నిజంగానే బాధ కలిగించింది. మరోవైపు నాకింకా ఐపీఎల్‌లో ఆడేందుకు మరో అవకాశం ఉందనే నమ్ముతున్నా’ అని వార్నర్‌ తన బాధను చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని