Rashid Khan: ప్రపంచ నేతలారా! మమ్మల్ని అరాచకత్వంలో వదిలేయకండి

తమను అరాచకత్వంలో వదిలేయొద్దని అఫ్గాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ కోరుతున్నాడు. అఫ్గానిస్థాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు చొరవ తీసుకోవాలని ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశాడు..

Published : 12 Aug 2021 01:24 IST

అఫ్గాన్‌లో రోజూ వేలల్లో మరణాలపై ఆవేదన

కాబూల్‌: తమను అరాచకత్వంలో వదిలేయొద్దని అఫ్గాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ కోరుతున్నాడు. అఫ్గానిస్థాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు చొరవ తీసుకోవాలని ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశాడు. పిల్లలు, మహిళలు సహా పౌరులు ప్రాణాలు కోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తినష్టం విపరీతంగా జరుగుతోందని ఆందోళన చెందాడు. ఈ మేరకు అతడు ట్వీట్‌ చేశాడు.

తాలిబన్ల అరాచకత్వంతో అఫ్గానిస్థాన్‌ అట్టుడుకుతోంది. అమెరికా తమ సైన్యాన్ని క్రమక్రమంగా తొలగిస్తుండటంతో అక్కడ అశాంతి తాండవిస్తోంది. తాలిబన్లు ఉగ్రదాడులతో చెలరేగుతున్నారు. పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. హెల్మండ్‌, కాందహార్‌, హెరాత్‌ రాష్ట్రాల్లో నెల రోజుల నుంచి ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే వెయ్యికి పైగా ప్రజలు మరణించడమో లేదా గాయపడటమో జరిగిందని సమాచారం.

మే 1 నుంచి అమెరికా తమ సేనలను వెనక్కి పిలిపిస్తోంది. అప్పట్నుంచి వరుసగా ఉగ్ర దాడులు జరుగుతున్నాయి. అఫ్గాన్‌లోని 400 జిల్లాలను ఇప్పటికే తాలిబన్లు ఆక్రమించారు. అయినప్పటికీ ఆగస్టు 31లోపు ఆ దేశం నుంచి పూర్తిగా సైన్యాన్ని వెనక్కి రప్పించేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో ‘ప్రియమైన ప్రపంచ నాయకులారా! నా దేశంలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. ప్రతిరోజు అమాయకులైన పిల్లలు, మహిళలు సహా పౌరులు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇళ్లు,  ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేల కుటుంబాలు తరలిపోతున్నాయి. మమ్మల్ని అరాచకత్వంలో వదిలేయకండి. అఫ్గాన్‌ పౌరుల మరణాలు, అఫ్గానిస్థాన్‌ నాశనాన్ని ఆపేయండి. మాకు శాంతి కావాలి’ అని రషీద్‌ ట్వీట్‌ చేశాడు. అతడి ట్వీట్‌కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి పుట్టినిల్లని, ఉగ్రవాదాన్ని అది పెంచిపోషిస్తోందని విమర్శలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని