Tokyo Olympics: పూజారాణి.. క్వార్టర్స్‌ గెలిస్తే పతకమే! ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన దీపిక

భారత యువ బాక్సర్‌ పూజారాణి (75 కిలోలు) సంచలనం సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అల్జేరియాకు చెందిన ఇచర్క్‌ చైబ్‌ను 5-0తో చిత్తు చేసింది. క్వార్టర్స్‌ గెలిచిందంటే ఆమెకు కనీసం కాంస్యం ఖాయమవుతుంది....

Updated : 28 Jul 2021 18:47 IST

టోక్యో: భారత యువ బాక్సర్‌ పూజారాణి (75 కిలోలు) సంచలనం సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌ చేరిందంటే ఆమెకు కనీసం కాంస్యం ఖాయమవుతుంది. మరోవైపు ప్రపంచ నంబర్‌ వన్‌ ఆర్చర్‌ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మిగిలిన క్రీడాంశాల్లో నిరాశే మిగిలింది.

ఇంకో మ్యాచ్‌ గెలిస్తే పతకమే

బాక్సింగ్‌లో క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. 75 కిలోల విభాగంలో పూజారాణి క్వార్టర్స్‌కు చేరుకుంది. అల్జీరియాకు చెందిన ఇచ్రక్‌ చైబ్‌ను 5-0తో చిత్తుగా ఓడించింది. ఐదుగురు న్యాయనిర్ణేతలూ ఆమెకే ఓటు వేశారు. మూడు రౌండ్లలోనూ ఆమె ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి సమతూకం లేకపోవడం ఆమెకు కలిసొచ్చింది. అరంగేట్రం ఒలింపిక్స్‌ ఆడుతున్నట్టే అనిపించలేదు. ఆమె పిడిగుద్దులకు ఇచ్రక్‌ నుంచి జవాబే లేదు. 30-26, 30-27, 30-27, 30-27, 30-27తో విజయం అందుకుంది. సెమీస్‌ చేరితే ఆమెకు కనీసం కాంస్య పతకం లభిస్తుంది. మంగళవారం లవ్లీనా క్వార్టర్స్‌ చేరుకున్న సంగతి తెలిసిందే.

ఆశలు రేపుతున్న దీపిక

పురుషుల ఆర్చరీలో నిరాశే ఎదురవ్వగా మహిళల విభాగంలో మాత్రం ప్రపంచ నంబర్‌ వన్‌ దీపికా కుమారి ఆశలు రేపింది. తొలి నాకౌట్‌ పోరులో భూటాన్‌కు చెందిన కర్మను 6-0 తేడాతో చిత్తు చేసింది. రెండో పోరులో అమెరికా అమ్మాయి జెన్నిఫర్‌ ఫెర్నాండెజ్‌ను 6-4తో ఓడించింది. నాలుగో సెట్లో స్కోరు 4-4తో సమం కావడంతో ఐదో సెట్‌ కీలకంగా మారింది. ఒత్తిడికి గురైనప్పటికీ దీపిక 26-25 తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించి మరో 2 పాయింట్లు అందుకుంది.

రాయ్‌, జాదవ్‌ ఇంటికి

పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో వీరిద్దరూ వెనుదిరిగారు. మొదటి పోరులో ఉక్రెయిన్‌ ఆర్చర్‌ హన్‌బిన్‌ పై 6-4 తేడాతో గెలిచిన రాయ్‌ ఇజ్రాయెల్‌కు చెందిన షానీ ఇటే చేతిలో 6-5 తేడాతో ఓటమి పాలయ్యాడు. షూటాఫ్‌లో కేవలం 1 పాయింటు తేడాతో వెనుదిరగడం గమనార్హం. ఇక ప్రవీణ్‌ జాదవ్‌ సైతం తొలి పోరులో రష్యా ఒలింపిక్‌ కమిటీ ఆటగాడు, ప్రపంచ నంబర్‌ 2 బజరజపోవ్‌ గాల్సన్‌ను 6-0తో తేడాతో చిత్తు చేశాడు. అయితే ప్రపంచ ఛాంపియన్‌ ఎలిన్‌ బ్రాడీ (అమెరికా) చేతిలో 6-0 తేడాతో ఓడిపోయాడు.

ప్రిక్వార్టర్స్‌కు సింధు

అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌లో దూసుకుపోతోంది. గ్రూప్‌-జేలో జరిగిన రెండో పోరులో ఆమె సునాయాస విజయం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ ఎంగన్‌ యిని 2-0 తేడాతో ఓడించింది. తొలి గేమ్‌ను 21-9తో కైవసం చేసుకున్న సింధు రెండో గేమ్‌లో కాసేపు శ్రమించాల్సి వచ్చింది. ప్రత్యర్థి పుంజుకొని పోటీనిచ్చింది. అయినప్పటికీ సింధు తన దూకుడు కొనసాగిస్తూ 21-16తో గేమ్‌తో పాటు మ్యాచును కైవసం చేసుకుంది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె బ్లిచ్‌ఫెల్ట్‌తో తలపడనుంది. క్వార్టర్స్‌లో యమగూచి, సెమీస్‌లో తైజు యింగ్‌తో తలపడే అవకాశం ఉంది. ఇక సాయి ప్రణీత్‌  14-21, 14-21 తేడాతో  నెదర్లాండ్స్‌ ఆటగాడు ఎం కల్‌జౌవు చేతిలో ఓడాడు. ప్రిక్వార్టర్స్‌కు చేరుకోలేకపోయాడు.

ఓటముల పరంపర

ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల ఓటముల పరంపర కొనసాగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచులో 4-1 తేడాతో ఓటమి చవిచూశారు. అందివచ్చిన అవకాశాలను టీమ్‌ఇండియా చేజేతులా జారవిడిచింది. ఇక భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరాలంటే తర్వాత తలపడే ప్రతి మ్యాచులోనూ తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి. బ్రిటన్‌లో హన్నా మార్టిన్‌ (2ని, 19ని), లిలీ (41ని), గ్రేస్‌ బాల్స్‌డన్‌ (57 ని) గోల్స్‌ చేశారు. భారత్‌ నుంచి షర్మిలా దేవి (23 ని) ఒక్కరే గోల్‌ చేయడం గమనార్హం.

రోయింగ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన

ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడుతున్న అర్జున్‌ లాల్‌ జాట్‌, అరవింద్‌ సింగ్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. రోయింగ్‌ సెమీ ఫైనల్‌ 2లో ఆరో స్థానంలో నిలిచారు. ఫైనల్‌కు చేరుకోలేదు. కానీ వారి ఆటతీరును అందరూ ప్రశంసిస్తున్నారు. పురుషుల స్కిఫ్‌ (సెయిలింగ్‌)లో కేసీ గణపతి, వరుణ్‌ టక్కర్‌ జోడీ మూడు రేసుల్లో 18, 17, 19 స్థానాల్లో నిలిచింది. మొత్తంగా 18వ స్థానం సాధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని