India vs Srilanka: కృనాల్‌కు కరోనా.. షాకింగ్‌ నిజాలు..

టీమ్‌ఇండియా యువ ఆటగాడు కృనాల్‌ పాండ్య కరోనా వ్యవహారంలో కొన్ని షాకింగ్‌ నిజాలు బయటపడ్డాయి! అతడు గొంతునొప్పి వస్తోందని చెప్పిన వెంటనే బీసీసీఐ వైద్యుడు ర్యాపిడ్‌ టెస్టు చేయలేదట...

Published : 14 Aug 2021 01:11 IST

గొంతునొప్పి వస్తుందన్నా పరీక్షించని వైద్యాధికారి!

దిల్లీ: టీమ్‌ఇండియా యువ ఆటగాడు కృనాల్‌ పాండ్య కరోనా వ్యవహారంలో కొన్ని షాకింగ్‌ నిజాలు బయటపడ్డాయి! అతడు గొంతునొప్పి వస్తోందని చెప్పిన వెంటనే బీసీసీఐ వైద్యుడు ర్యాపిడ్‌ టెస్టు చేయలేదట. అంతేకాకుండా జట్టు సమావేశానికీ అనుమతి ఇచ్చాడట. శ్రీలంక పర్యటనతో సంబంధం ఉన్న బీసీసీఐ వర్గాలు ఈ విషయం ధ్రువీకరిస్తున్నాయి.

మొదటి టీ20 తర్వాత కృనాల్‌ పాండ్యకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. దాంతో రెండో టీ20ని ఒక రోజు వాయిదా వేశారు. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందిని ఐసోలేషన్‌కు పంపించడంతో జట్టు గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. అయితే గొంతునొప్పి అని చెప్పిన వెంటనే వైద్యాధికారి స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదేమో!

వాస్తవంగా జులై 26న కృనాల్‌ పాండ్య తనకు గొంతు నొప్పి వస్తోందని ప్రధాన వైద్యాధికారి అభిజిత్‌ సల్వీకి చెప్పాడు. నిబంధనల ప్రకారం ఆరోజు అతడికి ర్యాపిడ్‌ టెస్టు చేయలేదు. పైగా జట్టు సమావేశంలో పాల్గొనేందుకు అతడికి అనుమతి ఇచ్చాడు. మరుసటి రోజైన 27న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేశాడు. ఫలితాలు మధ్యాహ్నం రావడంతో మ్యాచును వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ, ఎస్‌ఎల్‌సీ ప్రకటించాయి. మిగతా ఎనిమిది మందికీ పరీక్షలు చేశారు. జట్టంతా నెగెటివ్‌ అనే వచ్చింది. ఆలస్యంగా తెలిసిన విషయం ఏంటంటే.. శ్రీలంక నుంచి బయల్దేరే ముందు కృష్ణప్ప గౌతమ్‌, యుజ్వేంద్ర చాహల్‌కు పాజిటివ్‌ వచ్చింది.

‘జులై 26న కృనాల్‌కు గొంతునొప్పి వచ్చింది. నిబంధనల ప్రకారం అతడు వెంటనే వైద్యాధికారిని కలిశాడు. అతడికి ర్యాపిడ్‌ టెస్టు చేయించి ఐసోలేషన్‌కు పంపించాల్సింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ర్యాపిడ్‌తో కచ్చితమైన ఫలితం వస్తుందని కాదు! కానీ నిబంధనల్లో మొదట చేయాల్సింది మాత్రం అదే. గొంతు నొప్పి ఉన్నప్పటికీ కృనాల్‌ జట్టు సమావేశానికి హాజరయ్యాడని నేను చెప్పగలను’ అని బీసీసీఐ అధికారి వెల్లడించారు.

‘మరో ప్రశ్న ఏంటంటే.. ఐపీఎల్‌లో ప్రతి మూడు రోజులకు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేస్తుంటే శ్రీలంక సిరీసులో ఐదు రోజులకు చేసేందుకు బీసీసీఐ వైద్యబృందం ఎలా అంగీకరించిందో తెలియడం లేదు. నిజానికి సిరీస్‌ రద్దవ్వకుండా బీసీసీఐ కార్యదర్శి జే షా జోక్యం చేసుకున్నారు. కృనాల్‌తో కలిసిన వారిని ఐసోలేషన్‌కు పంపించారు. ఆయన చర్యల వల్లే ఈ సిరీస్‌ కొనసాగింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు మేలు జరిగింది. కానీ, వైద్యబృందం చురుగ్గా స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’ అని బీసీసీఐ ఇన్‌సైడర్‌ తెలిపారు. ఈ విషయాన్ని సల్విని అడగ్గా ‘నేనెలాంటి వ్యాఖ్యలు చేయలేను’ అని బదులిచ్చారు.

పాజిటివ్‌ కావడంతో కృనాల్‌, గౌతమ్‌, యూజీ టీమ్‌ఇండియాతో కలిసి స్వదేశానికి రాలేదు. ఆగస్టు ఆరంభంలో వారు ఇళ్లకు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని