India vs Srilanka: అందుకే.. విదేశీ కోచ్‌లను గుడ్డిగా నమ్మొద్దు!

విదేశీ కోచ్‌లు చెప్పిన ప్రతిదీ నమ్మొద్దని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నారు. యువ క్రికెటర్‌ దీపక్‌ చాహర్ క్రికెట్‌కు పనికిరాడని మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ అన్నాడని తెలిపారు. రాజస్థాన్‌ క్రికెట్‌ అకాడమీలో పనిచేస్తున్నప్పుడు ...

Published : 22 Jul 2021 12:53 IST

దీపక్‌ చాహర్‌ను ఛాపెల్‌ తిరస్కరించాడన్న వెంకటేశ్‌ ప్రసాద్

దిల్లీ: విదేశీ కోచ్‌లు చెప్పిన ప్రతిదీ నమ్మొద్దని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నారు. యువ క్రికెటర్‌ దీపక్‌ చాహర్ క్రికెట్‌కు పనికిరాడని మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ అన్నాడని తెలిపారు. రాజస్థాన్‌ క్రికెట్‌ అకాడమీలో పనిచేస్తున్నప్పుడు తక్కువ పొడవు ఉండటంతో క్రికెట్‌ వదిలేసి మరో పని వెతుక్కోవాలని అతడికి సూచించాడన్నారు. ఇప్పుడు అదే దీపక్‌ శ్రీలంకపై ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించాడని ప్రశంసించారు.

లంకేయులు నిర్దేశించిన 276 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 160కే 6 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కృనాల్‌ పాండ్య (35), భువనేశ్వర్‌ కుమార్‌ (19*) అండతో దీపక్‌ చాహర్‌ (69*; 82 బంతుల్లో 7×4, 1×6) లక్ష్యం ఛేదించాడు. 2-0తో సిరీస్‌ విజయం అందించాడు. కాగా, గ్రెగ్‌ ఛాపెల్‌ భారత కోచ్‌ పదవి వదిలేశాక లలిత్‌ మోదీ అతడిని రాజస్థాన్‌ క్రికెట్‌ అకాడమీ (ఆర్‌సీఏ) డైరెక్టర్‌గా నియమించారు. అప్పట్లో జరిగిన ఒక సంఘటనను వెంకటేశ్‌ ప్రసాద్‌ గుర్తు చేసుకున్నారు.

‘పొడవు తక్కువ ఉన్నాడని దీపక్‌ చాహర్‌ను ఆర్‌సీఏలో గ్రెగ్‌ ఛాపెల్‌ తిరస్కరించాడు. మరో పని చూసుకోమన్నాడు. ఇప్పుడు అదే చాహర్‌ తన ప్రాథమిక నైపుణ్యాలతో సంబంధం లేకుండా ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించాడు’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నారు.

‘ఇంతకీ నీతి ఏంటంటే.. మనల్ని మనం నమ్మాలి. విదేశీ కోచ్‌లను మరీ సీరియస్‌గా తీసుకోవద్దు. నిజమే, కొద్దిమంది ప్రోత్సహించేవాళ్లు ఉండొచ్చు! కానీ భారత్‌లో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారు. భారత కోచ్‌లు, మార్గనిర్దేశకులను ఫ్రాంచైజీలు, జట్లు నియమించుకోవాల్సిన సమయం ఇదే’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని