
IND vs ENG: ఇంగ్లాండ్ ఓపెనర్ల శుభారంభం.. ఆసక్తిగా ఐదోరోజు ఆట
లండన్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు ఆట పూర్తయేసరికి అతిథ్య జట్టు 77 పరుగులు చేసి దీటుగా బదిలిస్తోంది. ఓపెనర్లు రోరీ బర్న్స్(31; 109 బంతుల్లో 2x4), హమీద్(43; 85 బంతుల్లో 6x4) నాటౌట్‌గా నిలిచి శుభారంభం చేశారు. దీంతో చివరి రోజు ఆ జట్టు విజయానికి 291 పరుగులు అవసరమయ్యాయి. మరోవైపు చేతిలో పది వికెట్లు ఉండగా భారత్ విజయం సాధించాలంటే వారిని ఆలౌట్ చేయాల్సి ఉంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 466 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రిషభ్ పంత్ (50; 106 బంతుల్లో 4x4), శార్దూల్ ఠాకూర్ (60; 72 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలతో రాణించారు. వీరిద్దరూ శతక భాగస్వామ్యం జోడించడంతో పాటు టెయిలెండర్లు ఉమేశ్ యాదవ్(25; 23 బంతుల్లో 1x4, 2x6), జస్ప్రిత్ బుమ్రా (24; 38 బంతుల్లో 4x4) వీలైనన్ని పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 99 పరుగులు కలిసివచ్చి ఆ జట్టు లక్ష్యాన్ని 368 పరుగులకు తగ్గింది.
ఆదివారం 270/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 196 పరుగులు జోడించి మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ (44; 69 బంతుల్లో 7x4), జడేజా (17; 59 బంతుల్లో 3x4) నాలుగో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నిర్మించారు. అయితే, క్రిస్‌వోక్స్ స్వల్ప వ్యవధిలో జడేజా, రహానె (0)ను వికెట్లముందు దొరకబుచ్చుకొని భారత్‌కు గట్టి షాకిచ్చాడు. మరోవైపు నిలకడగా ఆడిన కోహ్లీ అర్ధశతకానికి ముందు మొయిన్ అలీ బౌలింగ్‌లో స్లిప్‌లో ఓవర్టన్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 312 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇక రెండో సెషన్లో ధాటిగా ఆడిన పంత్, శార్దూల్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. వేగంగా పరుగులు తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాలు సాధించారు. అయితే, వేగంగా ఆడుతున్న వీరు వరుస ఓవర్లలో ఔటయ్యారు. తొలుత రూట్ బౌలింగ్‌లో శార్దూల్ స్లిప్‌లో ఓవర్టన్కు దొరికిపోగా, తర్వాతి ఓవర్లోనే మొయిన్ అలీ బౌలింగ్‌లో పంత్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్, బుమ్రా మరో వికెట్ పడకుండా రెండో సెషన్ పూర్తి చేశారు. అప్పటికి జట్టు స్కోర్ 445/8గా ఉంది. ఇక మూడో సెషన్ ప్రారంభమైన కాసేపటికే ఇద్దరూ ఔటవ్వడంతో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ మూడు, మొయిన్ అలీ, రాబిన్సన్ రెండు వికెట్లు తీయగా అండర్సన్, ఓవర్టన్, రూట్ తలో వికెట్ తీశారు.