IND vs NZ : ఆధిక్యం టీమ్‌ఇండియాదే.. కానీ చివర్లో కాస్త తడబాటు

 కివీస్‌ను కట్టడి చేసి స్వల్ప ఆధిక్యం సాధించామన్న ఆనందం టీమ్‌ఇండియాకు కాసేపు కూడా లేదు. 49 పరుగుల...

Updated : 27 Nov 2021 20:11 IST

ముగిసిన మూడో రోజు ఆట

రెండో ఇన్నింగ్స్‌లోనూ తొలి దెబ్బ కొట్టిన జేమీసన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కివీస్‌ను కట్టడి చేసి స్వల్ప ఆధిక్యం సాధించామన్న ఆనందం టీమ్‌ఇండియాకు కాసేపు కూడా లేదు. 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1)ను కివీస్‌ బౌలర్‌ జేమీసన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. జేమీసన్‌కిది 50వ టెస్టు వికెట్‌ కావడం విశేషం. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 14 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం టీమ్‌ఇండియా 63 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. క్రీజ్‌లో మయాంక్‌ అగర్వాల్ (4*), పుజారా (9*) ఉన్నారు. అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఒక్క రోజే 11 వికెట్లు పడటం గమనార్హం. మూడో రోజు మొత్తం ఆధిక్యం ప్రదర్శించిన భారత్‌.. ఆఖర్లో గిల్‌ వికెట్‌ చేజార్చుకోవడంతో కాస్త తడబాటుకు గురైంది. అయితే అగర్వాల్, పుజారా మరో వికెట్‌ పడనీయకుండా రోజును ముగించారు.

చెలరేగిన భారత్‌ బౌలర్లు 

129/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌ను 296 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా అక్షర్‌ పటేల్ (5/62) కివీస్‌ను దెబ్బతీశాడు. అక్షర్‌కు తోడు అశ్విన్‌ (3/82) కీలకమైన సమయాల్లో వికెట్లు తీశారు. కివీస్‌ ఓపెనర్లు లేథమ్‌ (95), విల్ యంగ్ (89) సెంచరీ సాధించకుండా అడ్డుకున్నారు. ఆఖర్లో జేమీసన్‌ (23) భారత బౌలర్లను పరీక్షించగా... మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. విలియమ్సన్ 18, రాస్ టేలర్‌ 11, నికోల్స్ 2, టామ్‌ బ్లండెల్ 13, రచిన్‌ రవీంద్ర 13, సౌథీ 5, సోమర్‌విల్లే 6, అజాజ్ పటేల్ 5* పరుగులు చేశారు. రవీంద్ర జడేజా, ఉమేశ్‌ యాదవ్ చెరో వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని