
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కొత్త అవతారం! బాక్సింగ్ పోటీకి వ్యాఖ్యాతగా మాజీ అధ్యక్షుడు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు! దేశాధ్యక్షుడు, రాజకీయ నాయకుడు, బహుముఖ వ్యాపారవేత్తగా ఆయన అందరికీ పరిచితమే. శనివారం 58 ఏళ్ల మాజీ హెవీవెయిట్ ఛాపియన్ ఎవాండర్ హోలీఫీల్డ్ తలపడుతున్న బాక్సింగ్ పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
ఫ్లోరిడాలోని హాలీవుడ్‌లో తనయుడు డొనాల్డ్ జూనియర్‌తో కలిసి ట్రంప్ ఈ బాక్సింగ్ పోటీలకు వ్యాఖ్యానం చేయనున్నాడు. నాలుగు బౌట్ల ఈ పోటీని fite.tvకి పే పర్ వ్యూ విధానం ద్వారా వీక్షించొచ్చు. మొబైల్, స్మార్ట్‌టీవీ యాప్స్‌లోనూ చూడొచ్చు. ఇందుకు 49.9 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
‘గొప్ప పోరాట యోధులు, గొప్ప పోరాటాలంటే నాకిష్టం. ఈ శనివారం ఆ ఇద్దరు ఫైటర్ల పోరాటాన్ని వీక్షించేందుకు, నా ఆలోచనలు పంచుకొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీరెవ్వరూ మిస్సవ్వొద్దు’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
వాస్తవంగా ఈ పోటీలు లాస్ ఏంజెలెస్‌లో జరగాల్సి ఉంది. మాజీ యూఎఫ్‌సీ ఛాంపియన్ విక్టర్ బెల్‌ఫోర్ట్‌తో ఆస్కార్ డీలా హోయా తలపడాలి. కొవిడ్-19 రావడంతో హోయా పోటీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో హోలీఫీల్డ్ రావడంతో పోటీలకు కాలిఫోర్నియా అథ్లెటిక్స్ కమిషన్ అంగీకరించలేదు. ఎందుకంటే అక్టోబర్లో హోలీఫీల్డ్ 59 వసంతంలోకి అడుగుపెడతాడు. అతడు 2011 నుంచి బాక్సింగ్‌కు దూరంగానే ఉన్నాడు. దాంతో ఫ్లోరిడాకు వేదికను మార్చారు.
డొనాల్డ్ ట్రంప్‌నకు బాక్సింగ్‌తో అనుబంధం ఎక్కువే! కొన్నేళ్లు అతడు బాక్సింగ్ పోటీలకు ఆతిథ్యమిచ్చాడు. వివిధ బౌట్లను ప్రమోట్ చేశాడు. ఇందులో చాలావరకు అట్లాంటిక్ సిటీలోని తన సొంత క్యాసినోలోనే జరిగాయి. రాజకీయ వేదికలపై సంచలన వ్యాఖ్యలు చేసే ట్రంప్ బాక్సింగ్‌కు ఎలా వ్యాఖ్యానం చేస్తారో చూడాలి.
ఇవీ చదవండి
Advertisement