Gautam Gambhir: 2011లో మేం గెలిచినప్పుడు ఎవరూ అలా అనలేదు

విదేశాల్లో టీమ్‌ఇండియా గొప్ప విజయాలు సాధించాక మాజీ కోచ్‌ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించాయని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు...

Updated : 22 Nov 2021 16:50 IST

రవిశాస్త్రిపై మండిపడ్డ మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: విదేశాల్లో టీమ్‌ఇండియా గొప్ప విజయాలు సాధించాక మాజీ కోచ్‌ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించాయని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. తాజాగా గంభీర్‌ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. శాస్త్రి కోచింగ్‌పై స్పందించమని అడగడంతో గంభీర్‌ ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఎవరైనా బాగా ఆడేటప్పుడు గొప్పలు చెప్పుకోరు. ఆ విజయాల గురించి ఇతరులు మాట్లాడుకుంటే ఫర్వాలేదు కానీ, నీ గురించి నువ్వే చెప్పుకుంటే బాగోదు. మేం 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచినప్పుడు.. మాలో ఎవ్వరూ మేం అత్యుత్తమ జట్టు అనే వ్యాఖ్యలు చేయలేదు. అది దేశ ప్రజలకే వదిలేశాం. మనం విజయాలు సాధిస్తే అది ఇతరులు మాట్లాడుకునేలా ఉండాలి అని గంభీర్‌ చెప్పాడు.

టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో విజయాలు సాధించడం గొప్ప విశేషం. అది ఏ మాత్రం తక్కువ కాదు. అలాగే ఇంగ్లాండ్‌లోనూ రాణించింది. వాటి గురించి వేరేవాళ్లు మనల్ని కీర్తించాలి. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్న రాహుల్‌ ద్రవిడ్‌ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడనుకుంటున్నా. టీమ్‌ఇండియా గెలిచినా ఓడినా ఆయన స్పందన స్థిరంగా ఉంటుందని ఆశిస్తున్నా. ద్రవిడ్‌ తొలి ప్రాధాన్యం ఆటగాళ్ల ప్రవర్తన బాగుండాలని చూస్తాడు అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. 2018 - 2019 సీజన్‌లో ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా తొలిసారి బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ గెలిచిన అనంతరం రవిశాస్త్రి స్పందిస్తూ.. ఇదో అతిపెద్ద విజయం అని, అది 1983 ప్రపంచకప్‌ కన్నా గొప్ప విశేషమని కొనియాడాడు. వాటిపైనే గంభీర్‌ తాజాగా స్పందించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని