IND vs ENG: 26/11 దాడులప్పుడు ఇంగ్లాండ్‌ ఏం చేసిందో మర్చిపోవద్దు: గావస్కర్

ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దయిన నేపథ్యంలో భవిష్యత్‌లో తిరిగి నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న బీసీసీఐని దిగ్గజ బ్యాట్స్‌మెన్‌, మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ కొనియాడాడు...

Updated : 11 Sep 2021 12:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దయిన నేపథ్యంలో భవిష్యత్‌లో మ్యాచ్‌ తిరిగి నిర్వహించేందుకు ప్రయత్నిస్తోన్న బీసీసీఐని దిగ్గజ బ్యాట్స్‌మెన్‌, మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ కొనియాడాడు. భారత క్రికెట్‌ బోర్డు సరైన పని చేస్తోందని మెచ్చుకున్నాడు. 2008లో ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు 26/11 దాడులు జరిగాయని, అప్పుడా జట్టు చేసిన మేలును మర్చిపోవద్దని గుర్తుచేశాడు.

అప్పుడు ఇంగ్లాండ్‌ తొలుత నవంబర్‌లో ఏడు వన్డేల సిరీస్‌ కోసం భారత్‌కు వచ్చింది. అయితే, నవంబర్‌ 26న ముంబయిలో ఉగ్రదాడులు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు కటక్‌లో టీమ్ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదో వన్డే జరిగింది. ఆ మ్యాచ్‌లోనూ భారత్‌ గెలవడంతో 5-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. కానీ, ఆరోజు జరిగిన 26/11 దాడులతో భయపడ్డ ఇంగ్లాండ్‌ జట్టు మిగతా రెండు వన్డేలు ఆడకుండా ఉన్నపళంగా స్వదేశానికి తిరిగి వెళ్లింది. అనంతరం డిసెంబర్‌లో మళ్లీ రెండు టెస్టుల సిరీస్‌ కోసం కెవిన్‌ పీటర్సన్‌ సారథ్యంలో ఇంగ్లాండ్‌ టీమ్‌ భారత పర్యటనకు వచ్చి బీసీసీఐకి నష్టాలు కలగకుండా మేలు చేసింది. ఆ విషయాన్ని భారత్‌ మర్చిపోవద్దని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

‘ఐదో టెస్టును తిరిగి నిర్వహించడం సరైన పని. 2008లో ముంబయిలో 26/11 దాడులు జరిగినప్పుడు ఏం జరిగిందో మనం మరవకూడదు. వాళ్లు అప్పుడు భారత్‌లో భద్రత లేదని, మళ్లీ టెస్టు సిరీస్‌ ఆడేందుకు తాము రామని కచ్చితంగా చెప్పే అవకాశం ఉన్నా.. అలా చేయలేదు. అప్పుడు పీటర్సన్‌ ఆ జట్టుకు సారథిగా ఉన్నాడు. అతడి చొరవతోనే ఇంగ్లాండ్‌ జట్టు తిరిగి భారత్‌కు వచ్చి టెస్టు సిరీస్‌ ఆడింది. అలా చెన్నై టెస్టులో టీమ్‌ఇండియా చివరి రోజు 387 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 1-0తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇప్పుడు రద్దయిన ఐదో టెస్టును నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఇది శుభపరిణామం. క్రికెట్‌ బోర్డుల మధ్య ఇలాంటి సఖ్యత ఉండాలి’ అని గావస్కర్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని