Chris Woakes: ఇంకా 291.. ఇంగ్లాండ్‌ ఛేదించగలదు!

టీమ్‌ఇండియా నిర్దేశించిన 368 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఛేదించగలదని ఆల్‌రౌండర్‌ క్రిస్‌వోక్స్‌ ధీమా వ్యక్తం చేశాడు. గతంలో భారీ లక్ష్యాలను ఛేదించిన అనుభవం తమకు ఉందన్నాడు...

Published : 06 Sep 2021 11:09 IST

లండన్‌: టీమ్‌ఇండియా నిర్దేశించిన 368 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఛేదించగలదని ఆల్‌రౌండర్‌ క్రిస్‌వోక్స్‌ ధీమా వ్యక్తం చేశాడు. గతంలో భారీ లక్ష్యాలను ఛేదించిన అనుభవం తమకు ఉందన్నాడు. నాలుగో రోజు ఆఖర్లో తాము వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేశామని గుర్తుచేశాడు. జట్టు సమష్టిగా ఆడితే గెలుపు కష్టమేమీ కాదని అంటున్నాడు.

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 466 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌ పరుగుల లోటు మినహాయించి 368 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. బదులుగా ఆదివారం ఆట ముగిసే సరికి ఆంగ్లేయులు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేశారు. ఓపెనర్లు హసీబ్‌ హమీద్‌ (43), రోరీ బర్న్స్‌ (31) అజేయంగా నిలిచారు.

‘గొప్ప టెస్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏదేమైనా తొలి రెండు రోజులతో పోలిస్తే ఆఖరి రెండు రోజులు టెస్టు క్రికెట్లో ఎక్కువ కష్టపడాలి. మేం ఎక్కువ గంటలు ఫీల్డింగ్‌ చేశాం. అలసిపోయినా మా ఓపెనర్లు అజేయంగా నిలవడం అభినందనీయం. ఆఖరి రోజు కీలకం కానుంది’ అని వోక్స్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌ విజయం సాధించాలంటే సోమవారం ఇంకా 291 పరుగులు చేయాలి.

‘ఆఖరి రోజు పిచ్‌పై 291 పరుగులు చేయడం కష్టమైన పనే! కానీ వికెట్‌ ఇంకా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని గుర్తుంచుకోవాలి. రోజంతా బ్యాటింగ్‌ చేస్తే మేం గెలవగలం. ఆ నమ్మకం మాకుంది. ఇందుకెంతో శ్రమించాలి’ అని క్రిస్‌వోక్స్‌ తెలిపాడు.

ఇంగ్లాండ్‌ తన సొంతగడ్డపై ఇప్పటి వరకు ఛేదించిన అత్యధిక స్కోరు 362/9. హెడింగ్లే వేదికగా ఆఖరి వికెట్‌ను కాచుకొని బెన్‌స్టోక్స్‌ 135 పరుగులతో అజేయంగా నిలవడంతో ఆ గెలుపు దక్కింది. అతడి బ్యాటింగ్‌ యాషెస్‌ సిరీసును మలుపుతిప్పింది. ఇక గతేడాది పాక్‌ నిర్దేశించిన  277 పరుగుల లక్ష్యాన్ని ఆంగ్లేయులు ఛేదించారు. క్రిస్‌వోక్స్‌ 84తో అజేయంగా నిలిచాడు.

‘మా గత అనుభవాలు ఇప్పుడు ఉపయోగపడతాయి. జట్టుగా మేమిది చేయగలం. నమ్మకంతో ఆడటమే ముఖ్యం. గతంలో వేర్వేరు ఫార్మాట్లలో ఈ జట్టు అద్భుతాలు చేసింది. పిచ్‌ కాస్త మెరుగ్గా అనిపించడంతో ఫాస్ట్‌ బౌలర్లమైన మేం ఎక్కువగా బంతులు వేయాల్సి వచ్చింది. 45+ ఓవర్లు విసిరాం. వికెట్లు తీసేందుకు శ్రమించాం. చాలామందిమి అలిసిపోయాం. పుంజుకొని సోమవారం బాగా ఆడతామన్న విశ్వాసం ఉంది’ అని వోక్స్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు