IND vs PAK: షోయబ్‌ అక్తర్‌కు చురకంటించిన హర్భజన్‌

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తాజాగా మరోసారి చురక అంటించాడు. ఎన్నో ఏళ్లుగా ఇదరి మధ్యా అటు మైదానంలో...

Published : 19 Oct 2021 01:52 IST

గావస్కర్‌, కపిల్‌దేవ్‌కు ఒళ్లు పట్టిన పాక్‌ మాజీ పేసర్‌

(Photo: Shoaib Akhtar Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తాజాగా మరోసారి చురక అంటించాడు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి మధ్య అటు మైదానంలో, ఇటు సామాజిక మాధ్యమాల్లో మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అక్తర్‌ చేసిన ఓ సరదా ట్వీట్‌కు భజ్జీ తనదైనశైలిలో స్పందించాడు. అతడి పోస్టుకు దీటుగా బదులిచ్చాడు.

రాబోయే ఆదివారం భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్‌లో మరో కీలక పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ విశ్లేషణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇరు జట్లలోని పలువురు దిగ్గజ క్రికెటర్లు దుబాయ్‌కు చేరుకున్నారు. హర్భజన్‌, అక్తర్‌ ఓ చర్చా వేదికలో పాల్గొన్నారు. ఆ ఫొటోను పాక్‌ మాజీ పేసర్‌ ట్విటర్‌లో పంచుకొని.. ‘అన్నీ తెలుసనుకునే మిస్టర్‌ హర్భజన్‌ సింగ్‌తో భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ముందు దుబాయ్‌లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాను’ అంటూ అక్తర్‌ పోస్టు చేశాడు. దీనికి స్పందించిన హర్భజన్‌ చురక అంటించాడు. ‘టెస్టుల్లో 200 వికెట్ల కన్నా తక్కువ ఉన్న ఆటగాడి కంటే.. 400కి పైగా వికెట్లున్న ఆటగాడికే క్రికెట్‌ గురించి ఎక్కువ తెలుసు’ అని దీటుగా స్పందించాడు. టెస్టుల్లో అక్తర్‌ 178 వికెట్లు తీయగా.. హర్భజన్‌ 417 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

మరోవైపు షోయబ్‌ అక్తర్‌.. టీమ్‌ఇండియా దిగ్గజాలైన సునీల్‌ గావస్కర్‌, కపిల్‌దేవ్‌కు సరదాగా ఒళ్లు పట్టిన ఫొటోలను కూడా ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ‘క్రికెట్‌లో ఉత్తమ ఆటగాళ్లకే అత్యుత్తమ ఆటగాళ్లైన గావస్కర్‌, కపిల్‌ దేవ్‌, జహీర్‌ అబ్బాస్‌లాంటి దిగ్గజాలతో సరదాగా’ అంటూ మరో ట్వీట్‌ చేశాడు. అయితే, ఈ ఫొటోలపై అతడికి సొంత అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురవ్వడం గమనార్హం. కాగా, భారత్‌-పాక్‌ చివరిసారి 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి. భారత్‌ ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే తలపడుతున్నాయి. అయితే, ప్రపంచకప్‌ల చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్‌కు సంపూర్ణ ఆధిక్యం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ టీమ్‌ఇండియానే గెలుస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని