Harbhajan Singh : ‘మంకీగేట్‌ వివాదం’ గురించి త్వరలోనే తెలియజేస్తా : హర్భజన్‌

టీమ్‌ఇండియా 2008 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో జరిగిన ‘మంకీగేట్‌ వివాదం’ రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మొత్తం వ్యవహారం భారత స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ చుట్టూనే తిరిగింది...

Updated : 25 Dec 2021 16:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2008లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో చోటుచేసుకున్న ‘మంకీగేట్‌ వివాదం’ రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మొత్తం వ్యవహారం భారత స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ చుట్టూనే తిరిగింది. ఇది అప్పట్లో పెను సంచలనంగా మారి పతాక శీర్షికల్లో నిలిచింది. ఈ వివాదంలో భజ్జీ జాతివిద్వేష వ్యాఖ్యలు చేయలేదని తేలినా.. చివరికి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోతకు గురయ్యాడు. ఇది అతడి కెరీర్‌లో మాయని మచ్చలా మారింది. ఇక హర్భజన్‌ శుక్రవారం రిటైర్మెంట్‌ ప్రకటించాక ఆ వివాదంపై తొలిసారి స్పందించాడు. నాడు మైదానంలో ఏం జరిగిందనే విషయాన్ని త్వరలోనే ప్రజల ముందుకు తెస్తానన్నాడు.

‘ఆ వివాదం మొత్తంలో ఎవరూ నా వైపు ఉన్న నిజం గురించి ఆలోచించలేదు. అప్పట్లో కొన్ని వారాల పాటు నేనెలాంటి మానసిక ఆందోళనకు గురయ్యానో ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయంపై నేనెప్పుడూ ఎవరికీ పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ, త్వరలోనే ప్రజలందరికీ నా ఆటోబయోగ్రఫీ ద్వారా ఏం జరిగిందనే విషయం తెలుస్తుంది. ఆ సమయంలో నేను ఎలాంటి పరిస్థితులకు గురయ్యానో ఎవరూ అనుభవించకూడదు’ అని హర్భజన్‌ చెప్పుకొచ్చాడు.

అసలేం జరిగింది..?

సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 463 పరుగులు చేసింది. సైమండ్స్‌ (162*‌) భారీ శతకం సాధించాడు. అనంతరం వీవీఎస్‌ లక్ష్మణ్‌ (109), సచిన్‌ (154*) శతకాలతో చెలరేగడంతో భారత్‌ 532 పరుగులు చేసింది. మధ్యలో హర్భజన్‌ (63) పరుగులు చేశాడు. అయితే, ఇన్నింగ్స్‌ 116వ ఓవర్‌ తర్వాత భజ్జీ నాన్‌స్ట్రైకింగ్‌ వైపు వెళ్లి సైమండ్స్‌తో ఏదో మాట్లాడాడు. వెంటనే ఇద్దరి మధ్య మాటలతూటాలు పేలాయి. ఇక మ్యాచ్‌ అనంతరం హర్భజన్‌.. సైమండ్స్‌పై జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడని, కోతి అని పిలిచాడని ఆ జట్టు కెప్టెన్‌ రికీపాంటింగ్‌.. అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఇది మ్యాచ్‌ రిఫరీ వరకు వెళ్లగా టీమ్‌ఇండియా స్పిన్నర్‌పై 3 టెస్టుల నిషేధం పడింది. ఈ ఉదంతంపై పూర్తి విచారణకు ఆదేశించిన ఐసీసీ చివరికి హర్భజన్‌ అలాంటి వ్యాఖ్యలు చేశాడనడానికి ఆధారాలు లేకపోవడంతో నిషేధాన్ని తప్పించుకున్నాడు. కానీ, మ్యాచ్‌ ఫీజ్‌లో 50 శాతం కోతకు గురయ్యాడు. అయితే, ఈ విషయంలో ఆరోజు హర్భజన్‌.. సైమండ్స్‌తో ఏమన్నాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ వివాదంలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని తర్వలోనే తెలియజేస్తానని భజ్జీ తాజాగా ప్రకటించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని