Yogesh Kathuniya: ఔరా..! కోచ్‌ లేకుండానే రజతం గెలిచిన కతునియా

భారత అథ్లెట్‌ యోగేశ్‌ కతునియా కోచ్‌ లేకుండానే పారాలింపిక్స్‌లో పతకం గెలిచాడు. ఏడాది కాలంగా కోచ్‌ లేకుండానే సాధన చేశానని అతడు తెలిపాడు...

Published : 30 Aug 2021 14:42 IST

దిల్లీ: భారత అథ్లెట్‌ యోగేశ్‌ కతునియా కోచ్‌ లేకుండానే పారాలింపిక్స్‌లో పతకం గెలిచాడు. ఏడాదిగా కోచ్‌ లేకుండానే సాధన చేశానని అతడు తెలిపాడు. ప్యారిస్‌ పారాలింపిక్స్‌లో కచ్చితంగా స్వర్ణం గెలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

దిల్లీలోని కిరోరిమల్‌ కళాశాలలో బీకామ్‌ చదివిన 24 ఏళ్ల కతునియా టోక్యో పారాలింపిక్స్‌ డిస్కస్‌ త్రోలో రజతం గెలిచిన సంగతి తెలిసిందే. అతడు డిస్క్‌ను 44.38 మీటర్లు విసిరి అద్భుతం చేశాడు. ఆఖరి దఫా అయినా ఆరోసారి అతడీ ఘనత అందుకున్నాడు. ఐతే కోచ్‌ లేకుండానే అతడు ఈ రికార్డు సృష్టించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

‘నిజంగా ఇదో అద్భుతం. రజత పతకం గెలవడం 2024, ప్యారిస్‌ పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచేందుకు ప్రేరణనిస్తోంది’ అని కతునియా అన్నాడు. కరోనా వైరస్‌ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో సాధన చేసేందుకు రెండేళ్లు అతడు అడ్డంకులు ఎదుర్కొంటూనే ఉన్నాడు.

‘గత 18 నెలలుగా నా సాధన కఠినంగా సాగింది. ఆరు నెలలు లాక్‌డౌన్‌ ఉండటంతో భారత్‌లో ప్రతి స్టేడియం మూసేశారు. నేను మళ్లీ క్రమం తప్పకుండా స్టేడియానికి వెళ్లినప్పుడు ఒంటరిగా సాధన చేయాల్సి వచ్చింది. కోచ్‌ దొరకలేదు. దాంతో ఒక్కడినే సాధన చేశాను. అందుకే మార్గనిర్దేశకుడు లేకుండానే రజతం గెలవడం గొప్ప సందర్భం’ అని కతునియా తెలిపాడు.

యోగేశ్‌ తండ్రి సైన్యంలో పనిచేస్తారు. ఎనిమిదేళ్ల వయసులో పక్షవాతం రావడంతో కతునియా శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయడం లేదు. అందుకే ఎంతో కష్టపడి పారాలింపిక్స్‌కు సిద్ధమయ్యాడు. వచ్చే మెగా క్రీడల్లో కచ్చితంగా స్వర్ణం గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

‘నేను మరింత శ్రమిస్తాను. టోక్యోలో ఒక మీటరు తేడాతో స్వర్ణం దూరమైంది. కానీ, ప్యారిస్‌లో ప్రపంచ రికార్డు బద్దలు కొడతాను. ఈరోజు నాది కాదు! ఎందుకంటే నేను ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాలన్న లక్ష్యంతోనే బరిలోకి దిగాను’ అని కతునియా అన్నాడు. 2019లో దుబాయ్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అతడు డిస్క్‌ను 42.51 మీటర్లు విసిరి కాంస్యం గెలవడం గమనార్హం. దాంతోనే టోక్యో బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని