Devendra Jhajharia: నాన్న వల్లే నేనిలా..! ఆయనే గెలిపించాడని జజారియా భావోద్వేగం

పారాలింపిక్స్‌లో సాధించిన రజత పతకాన్ని తన తండ్రికి అంకితమిస్తున్నానని భారత జావెలిన్‌ త్రో ఆటగాడు దేవేంద్ర జజారియా అన్నాడు...

Updated : 22 Nov 2022 16:04 IST

దిల్లీ: పారాలింపిక్స్‌లో సాధించిన రజత పతకాన్ని తన తండ్రికి అంకితమిస్తున్నానని భారత జావెలిన్‌ త్రో ఆటగాడు దేవేంద్ర జజారియా అన్నాడు. ఆయన ప్రోత్సాహమే లేకుంటే తాను మూడో పతకం గెలిచే వాడినే కాదన్నాడు. క్రీడలకు బయల్దేరే ముందు, పతకం గెలిచిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తమతో మాట్లాడటం స్ఫూర్తినిచ్చిందని వెల్లడించాడు.

టోక్యో పారాలింపిక్స్‌ ఎఫ్‌46 విభాగంలో దేవేంద్ర జజారియా రజతం గెలిచిన సంగతి తెలిసిందే. అతడు జావెలిన్‌ను ఏకంగా 64.35 మీటర్లు విసిరి వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు నెలకొల్పాడు. అయితే శ్రీలంక ఆటగాడు మరింత దూరం ఈటెను విసరడంతో అతడిని స్వర్ణం వరించింది.

వరుసగా మూడో పారాలింపిక్స్‌ పతకం గెలిచేందుకు జజారియా గతేడాది గాంధీనగర్‌ సాయ్‌ కేంద్రంలో శిక్షణ తీసుకున్నాడు. అప్పుడే తన తండ్రికి క్యాన్సర్‌ వచ్చిందని తెలియడంతో శిక్షణ మానేసి ఇంటికి వెళ్లిపోయాడు. కానీ దేశానికి మూడో పతకం తీసుకురావాలని తండ్రి మాట తీసుకున్నాడు. కొడుకును మళ్లీ సాయ్‌కి పంపించాడు. దురదృష్టవశాత్తు గతేడాది అక్టోబర్లో ఆయన కన్నుమూశారు.

‘ఈ పతకం దేశ ప్రజలకు చెందుతుంది. కానీ నేనీ పతకాన్ని దివంగతులైన మా తండ్రి రామ్‌సింగ్‌ జజారియాకు అంకితమిస్తున్నా. ఆయనే పారాలింపిక్స్‌లో నేను మరో పతకం తేవాలని కోరుకున్నారు. నిజానికి ఆయన ప్రోత్సాహం లేకుంటే నేనిక్కడ ఉండేవాడినే కాదు. నేను మూడో పతకం గెలిచేందుకు కఠిన సాధన చేసేందుకు ఆయనే కృషి చేశారు. ఆయన కల నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది’ అని జజారియా తెలిపాడు.

‘ఆటల్లో ఇవన్నీ సహజమే. ఎప్పుడూ ఒడుదొడుకులు ఉంటాయి. నేను అత్యుత్తమంగానే ఆడాను. వ్యక్తిగత రికార్డును మెరుగుపర్చుకున్నాను. కానీ లంక ఆటగాడు మరింత మెరుగ్గా ఆడాడు’ అని జజారియా అన్నాడు. ప్రధాని నరేంద్రమోదీ తమతో మాట్లాడటం ఎంతో స్ఫూర్తినిచ్చిందని అతడు తెలిపాడు.

‘దేశానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చినందుకు మోదీ అభినందించారు. క్రీడాకారులు రాణించేలా దేశ ప్రధానే ప్రోత్సహించడాన్ని మించిన సంతోషం మరోటి లేదు. మేం పారాలింపిక్స్‌కు బయల్దేరే ముందూ ఆయన మాతో మాట్లాడారు. ఇప్పుడూ ప్రేరణనిస్తున్నారు. ఇది దేశక్రీడా రంగానికి మేలు చేస్తుంది’ అని జజారియా వెల్లడించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని