KL Rahul: వేటు గాయమే ఇంధనమైంది.. నడిపించింది!

సుదీర్ఘ ఫార్మాట్లో వేటు పడటంతో బాధపడ్డానని టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఇప్పుడదే బలంగా పునరాగమనం చేసేందుకు ఇంధనంలా ఉపయోగపడిందని పేర్కొన్నాడు...

Published : 14 Aug 2021 17:05 IST

లండన్‌: సుదీర్ఘ ఫార్మాట్లో వేటు పడటంతో బాధపడ్డానని టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఇప్పుడదే బలంగా పునరాగమనం చేసేందుకు ఇంధనంలా ఉపయోగపడిందని పేర్కొన్నాడు. జట్టులో తన చోటు సుస్థిరం చేసుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపాడు. బీసీసీఐ తరఫున రోహిత్‌ శర్మ చేసిన ముఖాముఖిలో అతడు మాట్లాడాడు.

‘టెస్టుల్లోంచి తప్పించడం నిరాశ కలిగించింది. నేను గాయపడ్డాను. ఇందుకు నన్ను తప్ప మరెవ్వరినీ నిందించలేను. ఒక అవకాశం కోసం ఎదురు చూశాను. అది నాకెంతో అవసరం. రాగానే అందిపుచ్చుకున్నాను. నేను నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాను. లార్డ్స్‌లో శతకం చేయడం మరింత ప్రత్యేకం’ అని రాహుల్‌ అన్నాడు.

‘నేనెలాంటి ఒత్తిడిని మోసుకురాలేదు. కొన్నిసార్లు గాయపడటం అవసరమే. ఎందుకంటే అది అదనంగా మనల్ని ముందుకు నెడుతుంది. మరింత శ్రమించేందుకు ఇంధనంగా మారుతుంది. నాకిప్పుడు అవకాశం వచ్చింది. జారవిడచాలని అనుకోలేదు’ అని రాహుల్‌ వెల్లడించాడు. ఈ రెండేళ్ల కాలంలో చేసుకున్న మార్పుల గురించి అతడు వివరించాడు.

‘జట్టులో చోటు పోకముందు నేను భిన్నమైన పరిస్థితుల్లో ఆడాను. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో పర్యటించాను. ఆ దేశాల్లో తొలిసారే పర్యటిస్తున్నా పరుగులు చేసేందుకే పాకులాడాను. అక్కడి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. నా మనసు గందరగోళంగా ఉందని గమనించాను. ప్రతి బంతికి రెండు షాట్లు ఆడాలనిపించేది. అదే పనిగా పరుగుల గురించే ఆలోచించేవాడిని’ అని రాహుల్‌ తెలిపాడు.

‘ఈ సారి కేవలం బంతిని చూసి ఆడాలని నాకు నేను చెప్పుకున్నాను. పరుగుల కోసం పాకులాడొద్దని అర్థం చేసుకున్నా. రాత్రికిరాత్రే ఇదంతా మారిపోలేదు. ఈ రెండేళ్లలో సాధన చేశాను. ఇతర ఆటగాళ్ల ఆటను చూశాను. పరుగులు చేయడం, ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రక్రియ ఒకటే. అదే నాకు సాయం చేసింది. టెస్టు క్రికెట్‌ నాకెంతో ఇష్టం. లార్డ్స్‌లో 100 చేశానని కాదు. ఇందులో ఉండే ఆనందం వేరు. టెస్టు క్రికెటర్‌ అవ్వాలనే నేను ఎదిగాను. నేను పెరిగే క్రమంలో మా నాన్న టెస్టు క్రికెట్‌ను ఆస్వాదించేవారు. మా కోచ్‌లు సైతం సుదీర్ఘ ఫార్మాట్లో రాణించాలని పదేపదే చెప్పేవారు’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని