IND vs PAK: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కొత్త రికార్డు

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీని మునుపెన్నడూ లేనంత మంది చూశారు. మరీ ముఖ్యంగా సూపర్‌-12 దశలో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడిన మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో వీక్షించారు...

Published : 26 Nov 2021 09:53 IST

ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయిన గణాంకాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీని మునుపెన్నడూ లేనంత మంది చూశారు. మరీ ముఖ్యంగా సూపర్‌-12 దశలో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడిన మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో వీక్షించారు. అక్టోబర్‌ 24న దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయినా, ఈ మ్యాచ్‌ను భారత్‌లోనే అత్యధిక మంది వీక్షించారని ఐసీసీ తాజాగా స్పష్టం చేసింది.

కేవలం మన దేశంలోనే స్టార్‌ ఇండియా నెట్‌వర్క్‌ ప్రసార మాధ్యమాల్లో ఏకంగా మొత్తం 15.9 బిలియన్‌ నిమిషాల పాటు ఈ మ్యాచ్‌ వీక్షణ జరిగింది. ఇది 2016 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక మంది వీక్షించిన భారత్‌-వెస్టిండీస్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ కన్నా ఎక్కువ. మరోవైపు కోహ్లీసేన ఈ టోర్నీలో సెమీస్‌ చేరకుండానే ఇంటిముఖం పట్టినా భారత్‌లో క్రికెట్‌ అభిమానులు ఈ మొత్తం టోర్నీని 112 బిలియన్‌ నిమిషాల పాటు వీక్షించారని ఐసీసీ తెలిపింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 వేల గంటలు లైవ్‌ కవరేజ్‌ చేసినట్లు పేర్కొంది.

మరోవైపు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌లో స్కై యూకే నెట్‌వర్క్‌ ప్రసారం చేయగా 60 శాతం ఎక్కువ మంది వీక్షించారు. అలాగే పాకిస్థాన్‌లోనూ పీటీవీ, ఏఆర్‌వై, టెన్‌స్పోర్ట్స్‌ లాంటి మూడు ప్రసార మాధ్యమాలు ఈ ప్రపంచకప్‌ టోర్నీని ప్రసారం చేయగా 7.3 శాతం అధికంగా చూశారు. ఆస్ట్రేలియలోనూ ఫాక్స్‌ నెట్‌వర్క్‌కు 175 శాతం మేరా అధికంగా వీక్షణలు లభించాయి. ఇటీవల అమెరికా మార్కెట్‌పై దృష్టిసారించిన ఐసీసీకి.. అక్కడా విశేష ఆదరణ లభించింది. ఈ ప్రపంచకప్‌ టోర్నీని అక్కడ ఈఎస్‌పీఎన్‌ ప్రాసారం చేయగా ఇంతకుముందెన్నడూ లేని విధంగా మ్యాచ్‌లను తిలకించారని స్పష్టం చేసింది.

కాగా, గతంలో ఫేస్‌బుక్‌తో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో అత్యధిక డిజిటల్‌ వ్యూస్‌ కూడా లభించాయని ఐసీసీ వివరించింది. దీంతో 2019 వన్డే ప్రపంచకప్‌లో సాధించిన 3.6 బిలియన్‌ వ్యూస్‌ రికార్డును ఈ టీ20 ప్రపంచకప్‌ బద్దలు కొట్టింది. ఈసారి ఏకంగా 4.3 బిలియన్‌ వ్యూస్‌ వచ్చాయని పేర్కొంది. అలాగే ఐసీసీ సామాజిక మాధ్యమాల్లోనూ వీడియోలు వీక్షించిన వారి సంఖ్య 618 మిలియన్లకు చేరిందని, అది 2019తో పోలిస్తే 28 శాతం పెరిగిందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని