
ICC: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి ఐసీసీ ఆసక్తి
దుబాయి: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి ఆసక్తిగా ఉన్నామని, అందుకు సంబంధించిన అడుగులు వేస్తున్నామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. ఈ విషయంపై గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్న ఐసీసీ ఇప్పుడు పూర్తిస్థాయిలో సన్నద్ధత అవుతోంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి ఐసీసీ సిద్ధంగా ఉండగా దానికి బీసీసీఐ మద్దతు కూడా ఉంటుందని సెక్రటరీ జైషా ఇటీవలే పేర్కొన్నారు. ఇంతకుముందు ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెడితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓసీ) జోక్యంతో తమ స్వతంత్ర ప్రతిపత్తి హోదా కోల్పోతామని భావించిన బీసీసీఐ అందుకు ఒప్పుకోలేదు. కానీ, షా ప్రకటనతో ఇప్పుడా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ఒకవేళ ఐసీసీ.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను గనుక ప్రవేశపెట్టగలిగితే లాస్ ఏంజిల్స్‌లో భారత జట్టును చూడొచ్చని షా అన్నారు.
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను కూడా దీర్ఘకాలంలో చూడాలనుకుంటున్నట్లు ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు వంద కోట్ల మందికి అభిమానులు ఉన్నారని, అందులో 90 శాతం మంది ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడాలనుకుంటున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా దక్షిణాసియా నుంచే 92శాతం మంది క్రికెట్‌పై ఆసక్తి చూపుతారన్నారు. ఇక అమెరికాలోనూ 30 మిలియన్ల మందికి క్రికెట్ అంటే ఇష్టమని పేర్కొన్నారు. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌పై స్పందించిన బార్క్లే.. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటి, జపాన్ అధికారులు, ప్రజలు వాటిని ఘనంగా నిర్వహించారని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ అభినందించారు. కాగా, ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేరితే మరింత బాగుంటుందని, అయితే.. అదంత తేలికైన పనికాదన్నారు. క్రికెట్‌లాగే మరికొన్ని క్రీడలు కూడా అందులో పాల్గొనాలనుకుంటున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లోనే తాము ఇప్పుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. 2024 ఒలింపిక్స్ సమయంలోనే 2028లో కొత్తగా చేర్చే క్రీడల గురించి ఐఓసీ నిర్ణయం తీసుకుంటుందని బార్క్లే తెలిపారు. మరోవైపు ఇటీవలే టోక్యోలో ముగిసిన విశ్వక్రీడలు తర్వాత 2024లో పారిస్‌లో జరగనున్నాయి. ఆపై 2028లో లాస్ఏంజిల్స్లో జరగనున్నాయి.