
IND vs ENG: ఐదో టెస్టుపై స్పష్టత.. బీసీసీఐ ఏం చెప్పిందంటే
ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టుపై స్పష్టత వచ్చింది. భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో ఇరు బోర్డులూ ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ చెప్పింది. అయితే, త్వరలోనే ఈ మ్యాచ్‌ను తిరిగి నిర్వహించేందుకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించింది. బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఇరు బోర్డుల పరస్పర అంగీకారంతో నేడు జరగాల్సిన ఐదో టెస్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని భావించాయని, అయితే.. ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో చర్చల అనంతరం రద్దు చేయడానికి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వివరించారు.
అయితే, ఐదో టెస్టును త్వరలోనే మళ్లీ నిర్వహించేందుకు ఈసీబీ(ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు)తో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ కష్టసమయాల్లో తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించినందుకు ఈసీబీకి జైషా ధన్యవాదాలు చెప్పాడు. మరోవైపు ఐదో టెస్ట్ రద్దవ్వడంపై పలువురు మాజీలు, క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేశారు. టీమ్‌ఇండియా ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్నందున చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ఇంగ్లాండ్ గడ్డపై కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్ రద్దుపై తొలుత ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు గందరగోళమైన ప్రకటన చేసింది. ఈ టెస్టులో టీమ్‌ఇండియా తమ తుది జట్టును బరిలోకి దింపలేకపోతున్నందున మ్యాచ్‌ను కోల్పోయిందని పేర్కొంది. తర్వాత ఈ వ్యాఖ్యలను సరిచేసుకొని ఐదో టెస్టు రద్దయినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ప్రకటనతో పూర్తి స్పష్టత వచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.