IND vs ENG: రెండో రోజు ఆట పూర్తి.. టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ 43/0

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(20), కేఎల్‌ రాహుల్‌(22) నాటౌట్‌గా నిలిచారు...

Updated : 04 Sep 2021 07:22 IST

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 290 ఆలౌట్‌

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(20), కేఎల్‌ రాహుల్‌(22) నాటౌట్‌గా నిలిచారు. టీమ్‌ఇండియా ఇంకా 56 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. మరోవైపు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రోహిత్‌, రాహుల్‌ ఒక్క వికెట్‌ కూడా పడకుండా జాగ్రత్తగా ఆడారు.

అంతకుముందు ఇంగ్లాండ్‌ భారీ స్కోర్‌ చేయడంలో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఓలీపోప్‌ (81; 159 బంతుల్లో 6x4), క్రిస్‌వోక్స్‌ (50; 60 బంతుల్లో 11x4) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ అర్ధ శతకాలతో రాణించి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. దీంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. మధ్యలో జానీ బెయిర్‌స్టో (37; 77 బంతుల్లో 7x4), మొయిన్‌ అలీ (35; 71 బంతుల్లో 7x4) సైతం తమవంతు పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ మూడు.. బుమ్రా, జడేజా రెండు వికెట్లు తీయగా శార్దూల్‌, సిరాజ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు 55/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ ఆదిలోనే క్రేగ్‌ ఓవర్టన్‌ (1), డేవిడ్‌ మలన్‌ (31) వికెట్లను కోల్పోయింది. ఉమేశ్‌ ఇద్దర్నీ పెవిలియన్‌ పంపి భారత శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, తర్వాత క్రీజులోకి వచ్చిన పోప్‌ నిలకడగా ఆడి ఆ జట్టును మంచి స్థితికి తీసుకెళ్లాడు. తొలుత బెయిర్‌స్టోతో కలిసి ఆరో వికెట్‌కు 89 పరుగులు జోడించిన అతడు తర్వాత మొయిన్‌ అలీతో ఏడో వికెట్‌కు 76 పరుగులు నమోదుచేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కాగా, ఈ ముగ్గురూ కీలక సమయాల్లో ఔటైనా చివర్లో క్రిస్‌వోక్స్‌ ధాటిగా ఆడి ఇంగ్లాండ్‌ను మెరుగైన స్థితిలో నిలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని