IND vs NZ: రచిన్‌ కోసం ప్రత్యేక ప్రణాళికలేం లేవు: అక్షర్‌

న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర కోసం ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించలేదని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ స్పష్టం చేశాడు. ముంబయి వేదికగా వాంఖడేలో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా విజయానికి...

Updated : 06 Dec 2021 08:35 IST

ముంబయి: న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర కోసం ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించలేదని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. ముంబయి వేదికగా వాంఖడేలో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా విజయానికి 5 వికెట్ల దూరంలో నిలిచింది. ఆదివారం మూడోరోజు ఆటలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌ను 276/7 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు కివీస్‌ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఛేదన కోసం బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ ఆట నిలిచిపోయేసరికి 140/5 స్కోర్‌తో నిలిచింది. రచిన్‌ రవీంద్ర (2; 23 బంతుల్లో), హెన్రీ నికోల్స్‌ (36; 86 బంతుల్లో 7x4) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

అయితే, తొలి టెస్టులో భారత విజయాన్ని అడ్డుకున్న రచిన్‌ రవీంద్రను ఔట్‌ చేయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అని మూడో రోజు ఆట అనంతరం అక్షర్‌ పటేల్‌ను మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్నాడు. ‘అతడి బలహీనతల గురించి మా బౌలింగ్‌ కోచ్‌ని సంప్రదించాం. దీంతో నాలుగో రోజు అందుకు తగ్గట్టే బౌలింగ్‌ చేస్తాం. ఇప్పుడు ఓపికతో ఉండాలి. తొలి టెస్టులో తక్కువ సమయం ఉండటంతో మ్యాచ్‌ గెలవలేకపోయాం. కానీ, ఇప్పుడలా కాదు. రెండు రోజుల సమయం ఉంది. అది మాకు కలిసొస్తుంది’ అని అక్షర్‌ ధీమా వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల సమయం ఉండగా భారత్‌ విజయానికి ఐదు వికెట్ల దూరంలో ఉంది. ఈరోజు ఉదయం సెషన్‌లోనే బౌలర్లు రాణిస్తే భోజన విరామానికి టీమ్‌ఇండియా ఘన విజయం సాధించే అవకాశం ఉంది. అయితే, కివీస్‌ ఆటగాళ్లు ఎంతసేపు పోరాడతారనేదే ఆసక్తిగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని