IND vs NZ: కోహ్లీ.. కివీస్‌ను ఫాలోఆన్‌ ఆడించకపోవడానికి కారణమిదేనా..?

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా పర్యాటక జట్టును ఫాలో ఆన్‌ ఆడించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే...

Updated : 05 Dec 2021 10:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా పర్యాటక జట్టును ఫాలో ఆన్‌ ఆడించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. శనివారం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటయ్యాక న్యూజిలాండ్‌ 62 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 263 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఈ క్రమంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కివీస్‌ను ఫాలోఆన్‌ ఆడిస్తాడని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను కాదని, కోహ్లీ మళ్లీ టీమ్‌ఇండియానే బరిలోకి దింపాడు. అయితే, దీని వెనక సదుద్దేశమే ఉందని సీనియర్‌ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ అంటున్నాడు.

‘ఈ టెస్టు తర్వాత టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అలాంటప్పుడు ఈ మ్యాచ్‌ను కేవలం మూడు, నాలుగు రోజుల్లో ముగించినా భారత్‌కు అదనపు పాయింట్లు రావు. కానీ, ఈ పిచ్‌ మీద ఎంత ఎక్కువగా బ్యాటింగ్‌ చేస్తే అంత దారుణంగా వికెట్ తయారవుతుంది. దాంతో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను మరోసారి తక్కువ స్కోరుకే పరిమితం చేయడం తేలికవుతుంది. ఇప్పుడు భారత బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే సరిపడా ఆధిక్యం ఉంది. అయితే, ఈ పరిస్థితులను చక్కగా వినియోగించుకొని ఆటగాళ్లు మరింత బాగా పుంజుకునేందుకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు’ అని డీకే ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, కోహ్లీ నుంచి వీలైనన్ని ఎక్కువ పరుగులను జట్టు ఆశిస్తోందని, కోహ్లీకి అవకాశం వచ్చి బ్యాట్‌ ఝుళిపిస్తే మంచి ఆధిక్యంతో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయొచ్చని డీకే అభిప్రాయపడ్డాడు. కివీస్‌ను ఫాలోఆన్‌ ఆడించకపోవడానికి.. బౌలర్లకు కాస్త విశ్రాంతినివ్వాలనే ఉద్దేశం కాదన్నాడు. ఆటలో ఇంకా మూడు రోజులు మిగిలున్నందున టీమ్‌ఇండియా తొందరపడటం లేదన్నాడు. ఒకవేళ ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడిస్తే.. ఎక్కువ పాయింట్లు లభించే అవకాశం ఉంటే అప్పుడు పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. కాబట్టి.. విరాట్‌ కోహ్లీ తీసుకున్న నిర్ణయం సరైందేనని, టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఇచ్చారని దినేశ్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని