IND vs NZ: కోహ్లీని అధిగమించిన గప్తిల్.. ఇంకొన్ని ఆసక్తికర రికార్డులు..!

టీమ్‌ఇండియా టీ20 మాజీ సారథి విరాట్‌ కోహ్లీని న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ అధిగమించాడు.

Published : 20 Nov 2021 13:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టీ20 మాజీ సారథి విరాట్‌ కోహ్లీని న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ అధిగమించాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇన్ని రోజులు టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్న విరాట్‌ను అతడు వెనక్కినెట్టాడు. తాజాగా ఇరు జట్ల మధ్య రాంచీలో జరిగిన రెండో టీ20లో ఈ విశేషం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు శుభారంభం చేశారు. మార్టిన్‌ గప్తిల్‌ (31; 15 బంతుల్లో 3x4, 2x6), డారిల్‌ మిచెల్‌ (31; 28 బంతుల్లో 3x4) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. దీపక్‌ చాహర్‌ వేసిన ఐదో ఓవర్‌లో రెండో బంతికి గప్తిల్‌ ఔటయ్యాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో విరాట్‌ కోహ్లీ 3,227 అత్యధిక పరుగుల రికార్డును గప్తిల్‌(3,248 పరుగులు) అధిగమించాడు. మరోవైపు ప్రస్తుత సారథి రోహిత్‌ శర్మ 3,141 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

సిక్సర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌ టాప్‌..

ఈ మ్యాచ్‌ ద్వారా న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ కూడా ఒక రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు (97) సాధించిన ఆటగాళ్ల టాప్‌ 9 జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఫిలిప్స్‌ మినహా మిగతా అందరూ వెస్టిండీస్‌ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. చాప్‌మన్‌ (21) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్‌ (34; 21 బంతుల్లో 1x4, 3x6) ఉన్న కాసేపు ధాటిగా ఆడి మూడు సిక్సులు బాదాడు. దీంతో అత్యధిక సిక్సర్ల జాబితాలో చేరాడు.

రోహిత్‌-రాహుల్‌ డబుల్‌ ధమాకా..

ఇక టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ టీ20ల్లో ఈనెలలోనే రెండోసారి శతక భాగస్వామ్యం జోడించారు. టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో చెలరేగిన వీరిద్దరూ తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించిన విషయం తెలిసిందే. అలాగే గతరాత్రి కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 117 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. మరోవైపు వీరిద్దరూ టీ20ల్లో వరుసగా ఐదు అర్ధశతక భాగస్వామ్యాలు కూడా జోడించారు. ఇంకో విశేషం ఏమిటంటే.. పొట్టి క్రికెట్‌లో ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో రోహిత్‌-ధావన్‌, రోహిత్‌-విరాట్‌, రోహిత్‌-రాహుల్‌ మాత్రమే రెండేసిసార్లు శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు.

రోహిత్‌తో సౌథీ.. తగ్గేదేలే..

న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌సౌథీ ఈ మ్యాచ్‌లోనూ టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌పై ఎప్పటిలాగే రెచ్చిపోయాడు. మరీ ముఖ్యంగా రోహిత్‌ను 11వ సారి ఔట్‌ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు హిట్‌మ్యాన్‌ను పెవిలియన్‌ చేర్చిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తంగా టీ20ల్లో నాలుగు సార్లు, వన్డేల్లో ఐదుసార్లు, టెస్టుల్లో రెండు సార్లు సౌథీ.. రోహిత్‌ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 16 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని