Team India: ముంబయి టెస్టుకు అజింక్యా..? మయాంకా?

ముంబయి వేదికగా వచ్చేనెల 3 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తుది జట్టులోకి రానున్న నేపథ్యంలో తాతాల్కిక కెప్టెన్‌ అజింక్య రహానెపై వేటుపడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి...

Updated : 29 Nov 2021 10:45 IST

అది కోహ్లీ తేల్చుకోవాల్సిన విషయం: వసీమ్‌ జాఫర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి వేదికగా వచ్చేనెల 3 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తుది జట్టులోకి రానున్న నేపథ్యంలో తాతాల్కిక కెప్టెన్‌ అజింక్య రహానెపై వేటుపడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది మెల్‌బోర్న్‌ టెస్టు తర్వాత ఫామ్‌ కోల్పోయి పూర్తిగా విఫలమవుతున్న అతడిని కివీస్‌తో తర్వాతి టెస్టుకు దూరం పెట్టే వీలుందని క్రికెట్‌ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు మయాంక్‌ అగర్వాల్‌ సైతం పరుగులు చేయలేకపోతుండటంతో జట్టు యాజమాన్యం ఈ విషయంలోనూ దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం కాన్పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మయాంక్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో 30 పరుగులు చేయగా రహానె 39 పరుగులే చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరిలో ఒకరిపై వేటు పడే వీలుంది. ఇదే విషయంపై మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ తన ఆలోచనలు పంచుకున్నాడు. తర్వాతి టెస్టులో ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎంపిక చేయాల్సి వస్తే అది కష్టమైన నిర్ణయమని, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే స్వయంగా తేల్చుకోవాల్సిన విషయమని పేర్కొన్నాడు.

‘మయాంక్‌ను ఆడించి మరో అవకాశం ఇవ్వాలనుకున్నా లేక అజింక్యను కొనసాగించి చూడాలనుకున్నా అది కోహ్లీ ఇష్టం. ఇందులో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కష్టమైనదే. ఎవరి మీద వేటు పడుతుందో చెప్పలేం. ఒకవేళ మయాంక్‌ను పక్కనపెడితే నేను మాత్రం.. సాహాను ఓపెనింగ్‌కు పంపాలని కోరుకుంటా. అలా చేస్తే మిగతా బ్యాట్స్‌మెన్‌ అందరూ ఎప్పటిలాగే తమ స్థానాల్లో కొనసాగుతారు. పుజారా, రహానె, కోహ్లీ ఆయా బ్యాటింగ్‌ పొజిషన్‌లోనే బరిలోకి దిగుతారు. అయితే, సాహాను ఓపెనింగ్‌కు పంపించడం సరైందేనా అని అడిగితే.. ఈ మ్యాచ్‌లు ఆడుతుంది స్వదేశంలోనే కాబట్టి ఫర్వాలేదని జాఫర్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని