Virat Kohli: దక్షిణాఫ్రికా పర్యటనపై త్వరలోనే స్పష్టత: కోహ్లీ

దక్షిణాఫ్రికా పర్యటనపై త్వరలోనే స్పష్టత వస్తుందని, ఈ విషయంలో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బీసీసీఐ పెద్దలతో మాట్లాడుతున్నాడని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు...

Published : 03 Dec 2021 01:20 IST

ముంబయి టెస్టుకు సాహా సిద్ధం

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనపై త్వరలోనే స్పష్టత వస్తుందని, ఈ విషయంలో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బీసీసీఐ పెద్దలతో మాట్లాడుతున్నాడని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో ముంబయిలో రెండో టెస్టు జరగనున్న నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలుత దక్షిణాఫ్రికా పర్యటనపై మాట్లాడుతూ.. ఆ విషయం గురించి జట్టులోని అందరితో మాట్లాడామని చెప్పాడు. ద్రవిడ్‌ సైతం బీసీసీఐ అధికారులతో చర్చించాడని.. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి సమాచారం తెలుస్తుందని పేర్కొన్నాడు.

అనంతరం వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా మెడనొప్పిపై స్పందించిన విరాట్‌.. ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకున్నాడని చెప్పాడు. దీంతో రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడన్నాడు. అయితే, తుది జట్టు గురించి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఈ టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్‌ చేసే జట్టునే ఎంపిక చేస్తామన్నాడు. అలాగే తాను తిరిగి జట్టులోకి రావడంపై మాట్లాడిన టీమ్‌ఇండియా సారథి.. ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత అవసరమని చెప్పాడు. బయోబబుల్‌ లాంటి కఠిన పరిస్థితుల్లో టోర్నీల మీద టోర్నీలు ఆడటం కష్టమని, అప్పుడప్పుడు ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమన్నాడు. అదే సమయంలో పనిభారాన్ని సమన్వయం చేసుకోవడం కూడా ముఖ్యమని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని