IND vs SL: 99 పరుగుల వద్ద భారీషాట్‌ ఆడాలనిటెంప్ట్‌ అయ్యా..కానీ : కేఎల్‌ రాహుల్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆదివారం 99 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా భారీ షాట్‌ ఆడేందుకు టెంప్ట్‌ అయ్యానని టీమ్‌ఇండియా శతక వీరుడు కేఎల్‌ రాహుల్‌...

Published : 28 Dec 2021 01:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆదివారం 99 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా భారీ షాట్‌ ఆడేందుకు టెంప్ట్‌ అయ్యానని టీమ్‌ఇండియా శతక వీరుడు కేఎల్‌ రాహుల్‌ (122*) అన్నాడు. తర్వాత తన భావోద్వేగాన్ని నియంత్రించుకొని అలాంటి షాట్‌ ఆడేందుకు విరమించుకున్నానని చెప్పాడు. సెంచూరియన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్‌ తొలిరోజు ఓపెనర్‌గా బరిలోకి దిగి రోజంతా బ్యాటింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. చివరికి అజింక్య రహానె (40)తో కలిసి 73 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే భారత్‌ ఆట నిలిచిపోయే సమయానికి 272/3 స్కోర్‌ చేసింది. మ్యాచ్‌ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన రాహుల్‌ తన ఆటతీరుపై సంతోషం వ్యక్తం చేశాడు.

‘నేను శతకానికి ఒక పరుగు దూరంలో ఉండగా స్పిన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ లేదా భారీషాట్‌ ఆడాలనుకున్నా. అప్పుడు ఫీల్డర్లంతా సర్కిల్‌లోనే ఉండటంతో భారీ షాట్‌ ఆడాదామని టెంప్ట్‌ అయ్యా. కానీ, దాన్ని విరమించుకున్నా. నేను ఈ ఏడాది లార్డ్స్‌లో శతకం బాదినప్పుడు కూడా ఇలాగే అనిపించింది. ఈ రెండు సందర్భాల్లో ఎంతో ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేసిన తీరు నాకే ఆశ్చర్యమేస్తుంది. అయితే, నేను ఆ సింగిల్‌ తీసి సెంచరీ చేయాలని అనుకోలేదు. ఆ ఒక్క బంతిని మాత్రమే అలా భారీ షాట్‌ ఆడాలని అనుకున్నా. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకున్నా. చివరికి మా జట్టును మంచి స్థితిలో నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది’ అని అతడు చెప్పుకొచ్చాడు. మరోవైపు రాహుల్‌ కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది 90 పరుగుల్లోకి వచ్చాడు. ఆపై బౌండరీ బాది శతకానికి చేరువయ్యాడు. చివరికి సింగిల్‌తోనే టెస్టుల్లో ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్‌ తరఫున దక్షిణాఫ్రికాలో టెస్టు క్రికెట్‌లో మూడంకెల స్కోర్‌ అందుకున్న రెండో ఓపెనర్‌గా నిలిచాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. పూర్తి వీడియో కోసం కింద ట్వీట్‌ను క్లిక్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని