IND vs SA: మన బౌలర్లకేమైంది?

‘‘లక్ష్యం 200 దాటితే చాలు.. దక్షిణాఫ్రికాకు కష్టమే! భారత్‌ విజయం లాంఛనమే’’.. రెండో టెస్టులో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌  నడుస్తున్నపుడు చాలామంది అంచనా ఇది...

Published : 07 Jan 2022 08:50 IST

జోహానెస్‌బర్గ్‌ : ‘‘లక్ష్యం 200 దాటితే చాలు.. దక్షిణాఫ్రికాకు కష్టమే! భారత్‌ విజయం లాంఛనమే’’.. రెండో టెస్టులో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌  నడుస్తున్నపుడు చాలామంది అంచనా ఇది. సఫారీ జట్టు ముందు 240 లక్ష్యం నిలిచినపుడు జొహానెస్‌బర్గ్‌లో భారత్‌ జయకేతనం ఎగురవేయబోతోందని, దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ కోసం మూడు దశాబ్దాలుగా సాగుతున్న నిరీక్షణ ఫలించబోతోందని అంచనాలు కట్టేశారు భారత అభిమానులు. కానీ చాలా కష్టం అనుకున్న లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం మూడే వికెట్లు కోల్పోయి సునాయాసంగానే ఛేదించేసింది. కొన్నేళ్లుగా ఇలాంటి సందర్భాల్లో గొప్పగా రాణించి భారత్‌కు విజయాలందించిన బౌలర్లు.. ఈ మ్యాచ్‌లో ఇలా విఫలమవుతారని ఎవ్వరూ అనుకోలేదు. మరి ఎక్కడ తేడా జరిగింది? భారత పేస్‌ పస తగ్గిందా? పిచ్‌ సహకరించలేదా? లేక దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ అంత గొప్పగా పోరాడారా? అన్న ప్రశ్నలు భారత అభిమానులను వేధిస్తున్నాయి? వాండరర్స్‌ పిచ్‌ అయితే అంత సులువుగా ఏమీ లేదు. బంతి బాగా బౌన్స్‌ అయింది. బ్యాట్స్‌మెన్‌కు గట్టి సవాలే విసిరింది.

అయితే భారత బౌలర్లు ఒంటి మీదికి ప్రమాదకర రీతిలో బంతులు సంధిస్తూ భయపెట్టే ప్రయత్నం చేసినా.. మొక్కవోని పట్టుదలతో నిలిచిన ఎల్గర్‌ను ఎంత పొగిడినా తక్కువే. ఆట, ఆటేతర వ్యవహారాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దక్షిణాఫ్రికా జట్టు.. ఈ మ్యాచ్‌లో ఓడితే ఒక రకమైన సంక్షోభంలో పడుతుందని ఎల్గర్‌కు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్‌ అసాధారణంగా పోరాడాడు. అతడికి మిగతా సహచరులు కూడా సహకరించడంతో దక్షిణాఫ్రికా విజయం సాధ్యమైంది. ఇక భారత బౌలర్ల విషయానికి వస్తే.. బుమ్రా వైఫల్యమే పెద్ద ఎదురు దెబ్బ. పేస్‌ దళాన్ని ముందుండి నడపిస్తాడనుకుంటే ఈ సిరీస్‌లో అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. అతడి పేస్‌లో పదును తగ్గిందన్నది స్పష్టం. ఫిట్‌నెస్‌ సమస్యలు కూడా అతణ్ని వెనక్కి లాగుతున్నట్లున్నాయి. సిరాజ్‌ సైతం రెండో టెస్టులో గాయంతో ఇబ్బంది పడి పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోవడంతో సఫారీ జట్టుపై ఒత్తిడి తగ్గిపోయింది. షమి, శార్దూల్‌ శాయశక్తులా ప్రయత్నించినా మిగతా బౌలర్ల నుంచి సహకారం అందక ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని సిరీస్‌  నిర్ణాయక మ్యాచ్‌లో అయినా మన పేస్‌  దళం స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి చిరకాల వాంఛను నెరవేరుస్తుందేమో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని