IND vs ENG: టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ 466 ఆలౌట్‌.. ఇంగ్లాండ్‌ లక్ష్యం 368

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 466 పరుగులకు ఆలౌటైంది. రెండో సెషన్‌లో రిషభ్‌ పంత్‌ (50; 106 బంతుల్లో 4x4), శార్దూల్‌ ఠాకూర్‌ (60; 72 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలతో అదరగొట్టారు...

Updated : 05 Sep 2021 21:33 IST

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 466 పరుగులకు ఆలౌటైంది. రెండో సెషన్‌లో రిషభ్‌ పంత్‌ (50; 106 బంతుల్లో 4x4), శార్దూల్‌ ఠాకూర్‌ (60; 72 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలతో అదరగొట్టారు. చివర్లో టెయిలెండర్లు ఉమేశ్‌ యాదవ్‌(25; 23 బంతుల్లో 1x4, 2x6), జస్ప్రిత్‌ బుమ్రా (24; 38 బంతుల్లో 4x4) సైతం వీలైనన్ని పరుగులు చేయడంతో భారత్‌ మంచి స్కోర్‌ సాధించింది. ఇంగ్లాండ్‌ ముందు 368 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఆదివారం 270/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్‌ మరో 196 పరుగులు జోడించి మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44; 69 బంతుల్లో 7x4), రవీంద్ర జడేజా (17; 59 బంతుల్లో  3x4) నిలకడగా ఆడి నాలుగో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం జోడించారు. అయితే, క్రిస్‌వోక్స్‌ స్వల్ప వ్యవధిలో భారత్‌ను గట్టి దెబ్బతీశాడు. తొలుత జడేజాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతడు కాసేపటికే రహానె (0)ను సైతం అదే విధంగా ఔట్‌ చేశాడు. దాంతో భారత్‌ 296 పరుగుల వద్ద రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మరోవైపు నిలకడగా ఆడిన కోహ్లీ అర్ధశతకానికి ముందు మొయిన్‌ అలీ బౌలింగ్‌లో స్లిప్‌లో ఓవర్టన్‌ చేతికి చిక్కాడు. ఆపై పంత్‌, శార్దూల్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు. అప్పటికి జట్టు స్కోర్‌ 329/6గా నమోదైంది.

ఇక రెండో సెషన్‌లో ధాటిగా ఆడిన ఇద్దరూ ఇంగ్లాండ్‌ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. వేగంగా పరుగులు తీస్తూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాలు సాధించి వరుస ఓవర్లలో ఔటయ్యారు. తొలుత రూట్‌ బౌలింగ్‌లో శార్దూల్‌ స్లిప్‌లో ఓవర్టన్‌కు దొరికిపోగా, తర్వాతి ఓవర్‌లోనే మొయిన్‌ అలీ బౌలింగ్‌లో అర్ధశతకం సాధించిన పంత్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రా మరో వికెట్‌ పడకుండా రెండో సెషన్‌ పూర్తి చేశారు. అప్పటికి జట్టు స్కోర్‌ 445/8గా ఉంది. ఇక మూడో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే ఇద్దరూ ఔటయ్యారు. దాంతో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో వోక్స్‌ మూడు, మొయిన్‌ అలీ రెండు వికెట్లు తీయగా అండర్సన్‌, ఓవర్టన్‌, రూట్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు