Published : 29 Jul 2021 11:06 IST

Tokyo Olympics: వేకువ నుంచీ గెలుపు వార్తలే.. క్వార్టర్స్‌కు హాకీ జట్టు, పీవీ సింధు, సతీశ్‌ కుమార్‌.. దుమ్మురేపిన అతాను

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటములతో విసిగిపోయిన అభిమానులకు గురువారం శుభవార్తలు వినిపించాయి. ఉదయాన్నే గెలుపు వార్తలు తెలిశాయి. భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాపై భారత హాకీ జట్టు తిరుగులేని విజయం నమోదు చేసింది. విలువిద్యలో అతాను దాస్‌ ప్రీక్వార్టర్స్‌ చేరుకొని ఆశలు కల్పిస్తున్నాడు.


సింధుతో మొదలు

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు టోక్యోలో దూసుకుపోతోంది. ప్రీక్వార్టర్స్‌లో 12వ ర్యాంక్‌ బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)ను 21-15, 21-13 తేడాతో చిత్తు చేసింది. రెండో రౌండ్లో లయ అందుకున్న సింధు అదే జోరును నాకౌట్లోనూ ప్రదర్శించింది. 40 నిమిషాల్లోనే ప్రత్యర్థిని కంగుతినిపించింది. బ్లిచ్‌ఫెల్ట్‌పై ఉన్న ఆధిక్యాన్ని సింధు 5-1కి పెంచుకుంది. క్వార్టర్స్‌, సెమీస్‌లో సింధుకు కఠిన ప్రత్యర్థులు ఎదరయ్యే అవకాశం ఉంది. క్వార్టర్స్‌లో అకానె యమగూచి, సెమీస్‌లో తైజు యింగ్‌తో తలపడాల్సి రావొచ్చు.


హాకీ.. క్వార్టర్స్‌  ఖరారు

హాకీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాకు షాకిచ్చింది టీమ్‌ఇండియా. పూల్‌-ఏలో జరిగిన నాలుగో పోరులో 3-1 తేడాతో విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. అర్జెంటీనాతో పోరు ఎంత హోరాహోరీగా సాగిందంటే.. తొలి రెండు క్వార్టర్లలో అసలు గోల్స్‌ నమోదు అవ్వలేదు. రెండు జట్లు దుర్భేద్యమైన డిఫెన్స్‌తో ముందుకు సాగాయి. 43వ నిమిషంలో వరుణ్‌ కుమార్‌ గోల్‌ కొట్టి భారత్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. 48వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను షూత్‌ కేసెల్లా గోల్‌గా మలవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఆట ముగిసే క్రమంలో 58వ నిమిషంలో వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌, 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్స్‌ కొట్టి 3-1తో విజయం అందించారు.


అతాను.. గట్టిపోరాటం

పురుషుల ఆర్చరీ వ్యక్తిగత పోటీల్లో అతానుదాస్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. తొలి ఎలిమినేషన్‌ పోరులో డెంగ్‌ యు చెంగ్‌ను 6-4 తేడాతో ఓడించాడు. వీరిద్దరూ నువ్వానేనా అన్నట్టు ఆడటంతో మ్యాచ్‌ ఐదు సెట్లకు దారితీసింది. నాలుగో సెట్లో స్కోరు 4-4తో సమం కావడంతో ఐదో సెట్‌ కీలకంగా మారింది. అందులో 28-26 తేడాతో అతాను పైచేయి సాధించడంతో 6-4తో విజయం దక్కింది. ఆ తర్వాత లండన్‌ ఒలింపిక్‌ విజేత, కఠిన ప్రత్యర్థి హో జిన్‌హెక్‌పై అద్వితీయ విజయం అందుకున్నాడు. షూటాఫ్‌కు చేరిన పోరులో కొరియా ఆటగాడిని 6-5 తేడాతో ఓడించాడు. ఐదు సెట్లు ముగిసే సరికి స్కోర్లు 5-5తో సమం అయ్యాయి. షూటాఫ్‌లో జిన్‌హెక్‌ 9 స్కోర్‌ చేయగా అతాను 10కి గురిపెట్టాడు.


సతీశ్‌.. ఇంకొక్కపంచ్‌

భారత బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ 91+కిలోల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించాడు. ఐదుగురు న్యాయనిర్ణేతల్లో నలుగురు సతీశ్‌ వైపే మొగ్గుచూపించారు. 30-27, 30-27, 28-29, 30-27, 30-26 స్కోర్లు ఇచ్చారు. ప్రత్యర్థి పాదాల కదలిక చురుగ్గా లేకపోవడాన్ని గమనించిన సతీశ్‌ అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ బాఖోదిర్‌ జలోలొవ్‌తో అతడు తలపడనున్నాడు. జలోలొవ్‌ ప్రపంచ, ఆసియా ఛాంపియన్‌ కావడం గమనార్హం. అతడిని ఓడించి సెమీస్‌కు చేరితే సతీశ్‌కు కనీసం కాంస్యం ఖాయమవుతుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని